Guntur residents : గుంటూరు వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. నగరంలోని శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. రూ.98 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు. గుంటూరులో ఈ ఫ్లై ఓవర్ ఇరుకుగా మారడంతో శంకర్ విలాస్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్లై ఓవర్ నిర్మిస్తామని ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ లోక్ సభ అభ్యర్థి, ప్రస్తుత కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. సమస్యను ఇటీవల నితిన్ గడ్కరీ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పెమ్మసాని చొరవతో కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయి.
రాష్ట్రంలో రోడ్లు, గుంటూరులో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సీఆర్ఐఎఫ్ పథకం కింద రాష్ట్రంలో 200.6 కి.మీ. మేర 13 రాష్ట్ర రాహదారులకు రూ.400 కోట్లు మంజూరయ్యాయని సీఎం వివరించారు. గుంటూరులో వంతెనకు రూ.98 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.