JAISW News Telugu

Amaravati : అమరావతికి అదిరిపోయే న్యూస్ చెప్పిన కేంద్రం

Amaravati

Amaravati

Amaravati : ఏపీ రాజధాని అమరావతికి ఒక్కొక్కటి సమకూరుతున్నాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ ప్రభుత్వానికి పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నడిపించే శక్తి వచ్చింది. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి 16 పార్లమెంట్‌ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం నిలబడాలి అంటే టీడీపీ అవసరం చాలా ఉంది. పైగా ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంగా ఇచ్చి ప్రాధాన్యం కల్పించారు. దీనిని కూడా పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానిగా స్పష్టం చేస్తూ విజయవాడ నుంచి అమరావతి మీదుగా గుంటూరు లైన్‌లో కలుపుతూ రైల్వే లైన్‌ను మంజూరు చేసింది. ఇందుకు అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుంది. ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా దీనిని ప్రత్యేక ప్రాజెక్ట్‌గా గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులైంది. రైల్వేశాఖ ఆగమేఘాలపై అమరావతి రైలు మార్గానికి అన్ని క్లియరెన్స్‌లు ఇస్తూ భూ సేకరణకు గెజిట్ రిలీజ్ చేసింది. అమరావతిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టడంతో వెంటనే అక్కడి కొత్త రైల్వేలైన్‌కు క్లియరెన్స్‌లు వచ్చేశాయి. గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలి, భూసేకరణ వ్యయం భరించాలనే కొర్రీలతో కాలయాపన చేసిన రైల్వే ఇప్పుడవేమీ లేకుండా పూర్తిగా తమ నిధులతోనే రైల్వే లైన్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. విజయవాడ, గుంటూరు రైల్వే లైన్లకు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా కొత్త రైల్వే లైన్‌ 2017–18లో మంజూరైంది. ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య 56.53 కిలో మీటర్ల మేర డబల్‌ లైన్, అమరావతి, పెదకూరపాడు మధ్య 24.5 కిలో మీటర్ల సింగిల్‌ లైన్, సత్తెనపల్లి–నరసరావుపేట మధ్య 25 కిలో మీటర్ల సింగిల్‌ లైన్‌ కలిపి మొత్తం 106 కిలో మీటర్ల మేర కొత్తలైన్‌కు ఆమోదం లభించింది.

2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఈ రైల్వేలైన్‌ విషయాన్ని పక్కన పెట్టింది. మూడు రాజధానుల సాకుతో అమరావతిలో రాయి కూడా కదల్చలేదు. నిజానికి కేంద్రాన్ని రైల్వేలైన్‌ గురించి  అడిగి ఉంటే ఈ పాటికి రైల్వేలైన్‌ పనులు పూర్తయ్యేవి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడంతో రైల్వేశాఖలో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టులో ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు మధ్య 56.53 కిలో మీటర్లు డబల్‌ లైన్‌ బదులుగా మొదట సింగిల్‌ లైన్‌ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ లైన్‌కు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయనుంది. సింగిల్‌ లైన్‌ నిర్మాణానికి, భూసేకరణకు కలిపి రూ. 2,600 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ కొత్త లైన్‌ విజయవాడ–హైదరాబాద్‌ లైన్‌లో ఎర్రుపాలెం వద్ద మొదలై, అమరావతి మీదుగా గుంటూరు–విజయవాడ లైన్‌లోని నంబూరు వద్ద కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులలో 9 కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు.

Exit mobile version