Chandrababu : ఏపీ అభివృద్ధికి తోడ్పడేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుందని, అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్ ను కేంద్రం క్లియర్ చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం విషయంలో పీఎం మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలిపారు.
దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్ లు నిర్మిస్తుంటే ఏపీలో మూడు కారిడార్ లు ఉన్నాయని, వీటిపై మొత్తం రూ.28 వేలు కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించారని చంద్రబాబు వెల్లడించారు. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్ లు వస్తున్నాయని, కృష్ణపట్నానికి కూడా అనుమతినిచ్చినట్లు సీఎం తెలిపారు. నక్కపల్లికి ఫార్మా క్లస్టర్ కూడా వస్తోందని, ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణమవుతాయని సీఎం చంద్రబాబు చెప్పారు.