EPFO : కేంద్రం సరికొత్త ఆలోచన.. ఈపీఎఫ్ఓ వేతన పరిమితి ₹21 వేలు విధించే అవకాశం !
EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)కు అర్హులయ్యే ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉంది. దీన్ని కేంద్రం రూ.21వేలకు పెంచుతుందని ప్రచారం జరుగుతోంది. దీన్ని పెంచాలని ఏళ్లుగా డిమాండ్లున్నాయి. మరోసారి దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఎనకమిక్ టైమ్స్ కథనం ప్రచురించింది.
కొత్త ప్రభుత్వంలో నిర్ణయం వెలువడచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. వేతనం పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంపై ఆ భారం పడుతుంది. దీని వల్ల ఉద్యోగులకు మేలు కలుగుతుంది. ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500గా ఉన్న మొత్తాన్ని రూ.15వేలకు పెంచారు. మరోవైపు ‘ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’ (ESIC) ఇప్పటికే రూ.21 వేలకు చేర్చింది.
ఎలా ప్రయోజనం చేకూరుతుంది..?
వేతన పరిమితి పెంచితే ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు జమయ్యే మొత్తం పెరుగుతుంది. ఉద్యోగి వాటాగా వేతనంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం ఈపీఎఫ్ఓకు చెల్లిస్తారు. ఉద్యోగి వాటా పూర్తిగా తన ఖాతాలో జమవుతుంది. యజమాని వాటాలో 8.33 శాతం పింఛన్ పథకంలో.. మిగతా మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. గరిష్ఠ వేతన పరిమితి పెంచితే ఆ మేర ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీంతో ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ ఖాతాలో జమ మొత్తం పెరుగుతుంది. రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన భవిష్యనిధి నిల్వలను ఎక్కువగా తీసుకోవచ్చు.