Bharat Rice:భారత్ బ్రాండ్ నుంచి బియ్యం..కిలో ఎంతంటే..!
Bharat Rice:దేశంలోని ఆహార పదార్ధాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే `భారత్ బ్రాండ్` పేరుతో పప్పు, గోధుమ పిండిని విక్రయిస్తోంది. ఇక నుంచి బియ్యాన్ని కూడా డిస్కౌంట్ ధరకే అందించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే `భారత్ రైస్` పేరుతో కిలో బియ్యాన్ని కేవలం రూ.25కే విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
దేశ వ్యాప్తంగా రిటైల్ స్టోర్‌లలో సగటు కిలో బియ్యం ధర క్రితం ఏడాదితో పోలిస్తే 14.1 శాతం పెరిగింది. దీంతో అందుబాటు ధరలో బియ్యాన్ని అందించేందుకు కేంద్రం ..`భారత్ రైస్`ను తీసుకురానున్నట్టు సమాచారం. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీ భండార్, మొబైల్ వ్యాన్‌ల ద్వారా రాయితీ ధరకు బియ్యం విక్రయాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్ బ్రాండ్ కింద రూ.60 కె కిలో శనగపప్పు, రూ.27.50కే కిలో గోధుమ పిండిని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా దేశంలోని 2వేల రిటైల్ పాయింట్లలో వీటిని విక్రయిస్తున్నారు. వీటిలాగే `భారత్ రైస్` విక్రయాలు కూడా చేపట్టనున్నట్టు సమాచారం.
దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా దేశంలో పెరుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు ఇటీవల కేంద్రం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. బాస్మతియేతర రకాల ఎగుమతులపై నిషేధం విధించింది. అటు బాస్మతి బియ్యంపైనా ఆంక్షల్ని అమల్లోకి తెచ్చింది. టన్ను ధర 1200 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యం ఎగుమతులను నిషేధించింది.