Amaravati : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతి రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
Amaravati railway project : ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ రాజధాని అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.2,245 కోట్ల వ్యయంతో 57 కిలో మీటర్ల పొడవునా నిర్మించనున్న అమరావతి రైల్వే లైన్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం (అక్టోబరు 24) జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి రైల్వే నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతికి హైదరాబాద్, చెన్నై, కోల్ కతా నగరాలతో రైల్ కనెక్టివిటి చేయనున్నారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణంతో దక్షిణ, మధ్య, ఉత్తర భారత్ తో ఏపీకి అనుసంధానం పెరగనుంది. ఈ రైల్వే ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై 3.2 కి.మీ పొడవునా రైల్వే బ్రిడ్జి నిర్మించనున్నారు. కాగా, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇటీవల భారీగా నిధులు కేటాయించిన మోదీ ప్రభుత్వం.. తాజాగా ఏపీకి మరో శుభవార్త అందించింది.