JAISW News Telugu

Aadhaar Update : కేంద్రం గుడ్ న్యూస్..ఆధార్ ఫ్రీ అప్ డేట్ కు మరోసారి గడువు పెంపు..

Aadhaar Update

Aadhaar Update

Aadhaar Update : దేశంలో  ప్రభుత్వ పథకాలకు, బ్యాంకింగ్, ఇతర ఆర్థిక, గుర్తింపునకు ఆధార్ నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆధార్ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. భారత పౌరుడికి ఆధార్ కీలక పత్రంగా కొనసాగుతోంది. తాజాగా ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేదుకు కేంద్రం ఇచ్చిన గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఈ సందర్భంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఉచిత అప్ డేట్ మరో మూడు నెలల గడువును పెంచుతున్నట్లు వెల్లడించింది.  వచ్చే  జూన్ 14వరకు ఉచితంగా ఆధార్ లో మార్పులు చేసుకోవచ్చని తెలిపింది. ఆధార్ అప్ డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్ తెలిపింది.

ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్ బుక్, పాస్ పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు.

టీసీ, మార్కుల షీట్, పాన్/ఇ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడుతాయని తెలిపింది. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను(మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఉచిత సేవలు ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పింది. కాగా, ఇప్పటికీ ఆధార్ అప్ డేట్ చేసుకోని వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

Exit mobile version