Chandrababu : పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయన్నారు. విడతల వారీగా పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా కేంద్ర ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పోలవరం ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు ఎదురయ్యాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టర్లను మార్చడం వల్ల ప్రాజెక్టు పనుల పురోగతి ఇబ్బందిగా మారిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చినందున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరంను త్వరితగతిన పూర్తి చేసి ఏపీ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తామని చంద్రబాబు చెప్పారు.
కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. ‘‘పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఏర్పాటు చేశారు. పోలవరానికి కేంద్రం పెండింగ్ నిధులు ఇవ్వాలి. కేంద్రం ఇవ్వలేదని ఎప్పుడూ పోలవరం పనులు ఆపలేదు. 2019లో పోలవరం ప్రాజెక్టుకు శనిగ్రహం ఆవరించింది. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులకు గ్రహణం పట్టింది. 2021 నాటికి పోలవరం పూర్తి చేసి ఉండాలి. వైసీపీ హయాంలో కేంద్రం రూ.8000 కోట్లు ఇచ్చింది, పీపీపీ లేఖ కూడా రాసింది. ఐదేళ్లుగా పురుషోత్తమపట్నం, పట్టిసీమను వినియోగించుకోలేదు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి మళ్లీ పోలవరాన్ని ట్రాక్‌లో పెట్టగలిగాం. కేంద్రం ప్రకటనతో ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం కలిగింది. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ధన్యావాదాలు. పోలవరం చాలా సున్నితమైన ప్రాజెక్టు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గోదాట్లో మునిగిన పోలవరం ఇప్పుడు మళ్లీ గట్టెక్కింది. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే మేలని నిపుణులు తేల్చేశారు. రూ.992 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తాం. 41.15 మీటర్ల ఎత్తుతో మొదటి దశ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేయాలన్నదే మా లక్ష్యమని చంద్రబాబు తెలిపారు.
దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్‌లు నిర్మిస్తుంటే. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మూడు కారిడార్‌లు ఉన్నాయి. వీటిపై మొత్తం రూ.28వేల కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్‌లు రానున్నాయి. కృష్ణపట్నానికి కూడా అనుమతిచ్చారు. నక్కపల్లికి ఫార్మా క్లస్టర్ కూడా రాబోతుంది. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణమవుతాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి చారిత్రాత్మక రోజు’’ అని చంద్రబాబు అన్నారు.