Census in Telangana : రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీ నుంచి కులగణన చేపట్టనున్నారు. అందుకోసం రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. గాంధీభవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అధ్యక్షతన కులగణనకు సంబంధించి ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా హాజరయ్యారు.
రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణనపై ప్రత్యేక సమావేశంలో 103 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో కులగణనకు సంబంధించి సమగ్రంగా చర్చించి పార్టీ పరంగా కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించారు. దేశంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపడుతున్నది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని, క్షేత్రస్థాయిలో కులగణనపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, పార్టీకి ప్రయోజనం కలిగేటా దీన్ని మలుచుకోవాలని పార్టీ భావిస్తున్నది. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపడుతున్నందున ఆయనను ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నది. ఈ మేరకు రాహుల్ కు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.