railway tracks : యూపీలో రైలు పట్టాలపై సిమెంట్ దిమ్మెలు.. ఢీకొట్టిన గూడ్స్
railway tracks : ఉత్తరప్రదేశ్లో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రాయ్ బరేలీలో మరో రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై ఉంచిన సిమెంట్ స్లాబ్ లను గూడ్స్ రైలు ఢీకొట్టింది. రాయ్ బరేలిలోని లక్ష్మణ్ పూర్ లో ఈ ఘటన జరిగింది. అయితే, రైలు ప్రమాదానికి కుట్ర పన్నినట్లు అధికారులు భావిస్తున్నారు. సమీపంలోని పొలంలో ఉంచిన మూడు సిమెంట్ దిమ్మెలను ట్రాక్ పైకి తీసుకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అయితే, లోకోపైలట్ అప్రమత్తత వల్ల ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన ఆర్పీఎప్ ఉంచాహర్ బృందం దర్యాప్తు చేస్తోంది.
గత నెల రోజులుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే రైళ్లకు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవల యూపీలోని లలిత్ పూర్ లో రైల్వేట్రాక్ పై ఇనుప రాడ్ లను ఉంచి రైలు పట్టాలు తప్పేందుకు ప్రయత్నించిన నిందితుడిని గత వారం పోలీసులు అరెస్టు చేశారు. ఇక, కాన్పూర్ లోని రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ ను గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్లోని బుర్హాన్ పూర్ ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న రైలును పేల్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. రైల్వే ట్రాక్ పై ఉంచిన పేలుడు పదార్థాలను అధికారులు గుర్తించారు. గుజరాత్ లోని బొటాడ్ లో పట్టాలపై ఇనుప ముక్కను ఉంచిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.