Cell Phone : పడుకునేటప్పుడు కూడా సెల్ ఫోన్ పక్కనే పెట్టుకుంటున్నారా?

Cell Phone

Cell Phone with Sleeping

Cell Phone : పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునేదాక మన చేతిలో సెల్ ఫోన్ చేతిలో ఉండాల్సిందే. సెల్ ఫోన్ ఇప్పుడు మన శరీరంలో ఒక భాగమైపోయిందనే చెప్పాలి. బెస్ట్ ఫ్రెండ్ మన పక్కన లేకున్నా గానీ సెల్ ఫోన్ ఉంటే చాలు అన్నట్టు మారిపోయింది పరిస్థితి. ఎవరున్నా లేకున్నా సెల్ ఫోన్ ఉంటే చాలు గంటలు క్షణాలుగా గడిచిపోతాయి. అయితే దాని వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సెల్ ఫోన్లతో పాటు ఇండ్లలో ఉండే వైఫేలు, ల్యాప్ టాప్ లతో వచ్చే రేడియేషన్ మనిషి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి.

మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ నీలికాంతిని రిలీజ్ చేస్తుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు సెల్ ఫోన్ ను చూస్తూ గడిపితే అది వెల్లజల్లే బ్లూలైట్ వల్ల మన మెదడులో మెలటోనిన్ పై ప్రభావం పడుతుంది. దీనివల్ల నిద్రలేమి, కనుచూపు తగ్గడం, అలాగే సెల్ ఫోన్, రూటర్ల రేడియేషన్ల వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పడుకునే ముందు సెల్ ఫోన్ ను దూరంగా పెట్టడమే కాదు, రూటర్లు, వైఫేలను నిలిపివేయాలని చెబుతున్నారు.

అలాగే ల్యాప్ టాప్ లను మోకాళ్లపై పెట్టుకుని గంటల తరబడి పనిచేయడం వల్ల వీర్యకణాలు తగ్గిపోతాయని, అలాగే వాటి సామర్థ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే సెల్ ఫోన్ ను నిత్యం ప్యాంటు జేబులో పెట్టుకోవడం, చొక్కా జేబులో పెట్టుకోవడం వల్ల కూడా నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు.

సెల్ ఫోన్ ను అధికంగా వాడడం వల్ల నిద్ర సరిగ్గా రాక ఒత్తిడి కూడా పెరుగుతుందని అంటున్నారు. సోషల్ మీడియాలో చాటింగ్ వల్ల ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే ఒత్తిడి పెరగడమే కాదు దాని వల్ల అనవసర ఆలోచనలు పెరుగుతాయని చెబుతున్నారు. దీనివల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.

సెల్ ఫోన్ అవసరానికి మించి ఎక్కువగా వాడవద్దు. అలాగే రాత్రివేళ సెల్ ఫోన్ చూడడం కంటే ఇష్టమైన పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పడుకునే ముందు కచ్చితంగా వైఫేతో పాటు సెల్ ఫోన్ నెట్ ను ఆపుచేసుకోవాలంటున్నారు.

 

TAGS