Kolkata trainee doctor case : కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ కేసులో సీబీఐ కీలక చార్జిషీట్.. అందులో ఏముందంటే?
Kolkata trainee doctor case : దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ఆర్‌జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై లైంగికదాడి, మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పై సీబీఐ సోమవారం (అక్టోబర్ 07) చార్జిషీట్ దాఖలు చేసింది. కోల్ కత్తా ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ లో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్థానిక పోలీసుల్లో పౌర వలంటీర్ గా పని చేస్తున్న రాయ్ ఆగస్ట్ 9న బాధితురాలు విరామ సమయంలో హాస్పిటల్ లోని సెమినార్ గదిలో నిద్రించడానికి వెళ్లినప్పుడు ఈ నేరానికి పాల్పడినట్లు పేర్కొంది. గ్యాంగ్ రేప్ అభియోగాన్ని సీబీఐ పేర్కొనలేదని రాయ్ ఒక్కడే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
సాక్ష్యాలను నాశనం చేయడంలో ఘటన తర్వాత రాయ్ ను రక్షించేందుకు ప్రయత్నించడంలో ఆర్జికర్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, అప్పటి తాలా పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) అభిజిత్ మొండల్ పాత్రపై దర్యాప్తు సంస్థ అనుబంధ ఛార్జిషీట్లను దాఖలు చేయనుంది. ఘోష్, మొండల్ ఇద్దరినీ సెప్టెంబర్ 14న అరెస్టు చేశారు.
సీబీఐ చర్యపై టీఎంసీ రియాక్షన్
లైంగికదాడి, హత్య ఘటన జరిగిన 24 గంటల్లోనే కోల్ కత్తా పోలీసులు నిందితుడు సంజయ్ రాయ్ ను అరెస్టు చేశారని, ఘటన జరిగిన నెలన్నర తర్వాత దర్యాప్తు సంస్థ ఆలస్యంగా చర్యలు తీసుకోవడంపై అధికార టీఎంసీ మండిపడింది. కేసులో సీబీఐని కోరుకున్న వారు 24 గంటల్లో కోల్ కత్తా పోలీసులు అరెస్ట్ చేసిన సంజయ్ రాయ్ పేరిట మాత్రమే చార్జిషీట్ ఇచ్చారు. వారు దర్యాప్తు చేయనివ్వండి’ అని టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ మృతదేహం ఆగస్ట్ 9 ఉదయం ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ గదిలో అర్ధనగ్నంగా కనిపించింది. నిందితుడు సంజయ్ రాయ్ ని కోల్ కతా పోలీసులు ఆగస్ట్ 10న అరెస్ట్ చేసి ఆగస్ట్ 24 వరకు పోలీసు కస్టడీకి పంపారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 13న దర్యాప్తును సీబీఐకి అప్పగించారు.