Revanth : రేవంత్ రెడ్డి సీఎం చైర్ లో కూర్చున్నప్పటి నుంచి పాలన స్పీడ్ పెంచుతున్నారు. హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతల నుంచి మూసీ సుందరీకరణ వరకు దూకుడుగా ముందుకెళ్తున్నారు. హైడ్రా తీసుకువచ్చిన తర్వాత కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వెలువడినా.. వారు పట్టించుకోవడం లేదు. ఈ సమయంలో ఎలాంటి ఆర్థిక, అక్రమ వివాదాల్లో తలదూర్చ వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరులతో పాటు పార్టీ మెంబర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రతిపక్షాలు తాము తీసుకుంటున్న నిర్ణయాలపై బురదజల్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఈ నేపథ్యంలో మీరు గనుక ఆర్థిక, అక్రమాలు లాంటి ఆరోపణల్లో చిక్కుకుంటే తాను ఎవరికీ సాయం చేయనని ఆయన సూచించినట్లు సమాచారం. మూసీ సుందరీకరణ, హైడ్రా కూల్చివేతల వంటి ప్రాజెక్టులను ప్రతిపక్షాలు, ఒక వర్గం మీడియా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తన మూసీ ప్రాజెక్టును, హైడ్రా కార్యకలాపాలను నిలిపివేసే ప్రసక్తే లేదని పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారని, ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని పార్టీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ రెండు మిషన్లు చేపట్టడానికి గల కారణాలేమిటని ప్రశ్నించగా తమకు స్పష్టమైన ఆధారాలు లేవని ఇన్ సైడర్లు తెలిపారు. మూసీ ప్రాజెక్టు, హైడ్రా వల్ల కాంగ్రెస్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని పార్టీలోని పలుకుబడి ఉన్న నేతలు రేవంత్ రెడ్డిని హెచ్చరించినట్లు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోకుండా చెవిన పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కొండా సురేఖ విషయం పార్టీలో కొంత కలకలం రేపింది. సినిమా ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వంగా మారింది. ఇలాంటి వివాదాల నేపథ్యంలో సీఎం ఇలాంటి వార్నింగ్ ఇచ్చినట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు.