AP Caste Census : ఏపీలో కులగణన చేపట్టి తెగ హడావిడి చేసింది జగన్ ప్రభుత్వం. అయితే దీని వెనుక పెద్ద స్కాం ఉందన్న ఆరోపణలు వినపడుతున్నాయి. కులగణన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సర్వే వివరాలు ఎఫ్ఏవో సంస్థకు చేరిపోయాయి. ఆ సంస్థతో కాంట్రాక్ట్ ఆపేశామని ప్రభుత్వం చెబుతున్నా ఆ సమాచారం అనధికారికంగా చేరింది. అధికారికంగా మాత్రం కులగణనను పక్కనపెట్టామని అంటున్నారు. ఈ సర్వే వివరాలను పుస్తక రూపంలో తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదంటున్నారు.
ఇప్పటి వరకు కులగణన వివరాలు ప్రణాళిక శాఖ వద్దకు కూడా చేరలేదని చెబుతున్నారు. కార్యక్రమానికి నేతృత్వం వహించింది ప్రణాళిక శాఖే అయినప్పటికీ.. సర్వే చేసింది మాత్రం వార్డు, గ్రామ సచివాలయాల కార్యదర్శులు. వారికి వలంటీర్లు సహకరించారు. గత నెల 20వ తేదీకే వివరాల సేకరణ పూర్తయినప్పటికీ, అవి సచివాలయాల శాఖ వద్దే నిలిచిపోయాయి. వీరందరి డేటా ప్రాసెస్ చేసేది రామ్ ఇన్ఫో,ఎఫ్ఏవో నే.
కులాల వివరాలే కాకుండా వారి ఆర్థిక పరిస్థితి, ఆస్తులు, ఇళ్లలో ఉన్న పశువుల వివరాలు, గొర్రెలు, వంట కోసం వినియోగిస్తున్న గ్యాస్, విద్యుత్ స్టౌ, వంట చెరుకు, గోబర్ గ్యాస్, బయో ఇంధనం వంటి విధానాలను కూడా తెలుసుకున్నారు. ఆదాయ వనరులు, వారికి ఉన్న వ్యవసాయ భూమి, ఇళ్లు వంటి వాటి వివరాలతో పాటు, 50 సెంట్లు కన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు, అంతకుమించి భూమి ఉన్న వారి వివరాలను కూడా సేకరించారు. అసలు లక్ష్యం కులగణన పేరుతో ప్రభుత్వం చేసుకున్న ప్రచారం కాదని.. కేవలం రాజకీయంగా సమాచారాన్ని వాడుకునేందుకు ప్రజల డేటా చోరీ చేశారన్న అనుమానాలు బలంగా వినిపిస్తుండడం గమనార్హం.