Home Minister Anita : వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే కేసులు: హోంమంత్రి అనిత
Home Minister Anita : వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఏపీ హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఏలూరు కాల్ మనీ ఘటనపై ఆమె స్పందించారు. కుస్తీలకు ముందే వడ్డీ కోత, సమయం దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మనీ వ్యవహారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూల్లతో వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోజూవారి వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేసేవారిని సహించబోమన్నారు. వసూళ్ల పేరుతో అమాయకులను బలిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.
వైసీపీ నేత కాల్ మనీ దందాకు తాము బలయ్యామని ఇటీవల ఏలూరులో బాధితులు ఆరోపించారు. అప్పు ఇచ్చి దానికి ఇష్టమొచ్చినట్లు వడ్డీలు కట్టించుకునే వారని, సమయానికి కట్టకపోతే అసభ్యపదజాలంతో తిట్టేవారని వాపోయారు. భయపడి కట్టినా ఇంకా బకాయి ఉన్నారంటూ వేధించేవారని పేర్కొన్నారు. అప్పు ఇచ్చిన సమయంలో తీసుకున్న ప్రామిసరీ నోట్లతో ఇప్పుడు కోర్టు చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏలూరు ఎస్పీతో మంత్రి అనిత ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.