KTR : కేటీఆర్‌పై కేసు నమోదు

KTR
KTR : భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్)పై నకిరేకల్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. టెన్త్ క్లాస్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన నిందితులతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారని ఆరోపిస్తూ నకిరేకల్ మున్సిపల్ ఛైర్పర్సన్ చెవుగోని రజిత, ఆమె భర్త శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు కేటీఆర్‌పై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. చెవుగోని రజిత, శ్రీనివాస్ తమ ఫిర్యాదులో కేటీఆర్ తమపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, దీనివల్ల తమ పరువుకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. టెన్త్ పరీక్షల మాస్ కాపీయింగ్ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.
కేటీఆర్ చేసిన ట్వీట్ తమను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ఈ మేరకు నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.