BRS MLA : కొత్త చట్టం కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

BRS MLA

BRS MLA

BRS MLA : హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ ఒకటో ఠాణాలో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింది కేసు నమోదు చేశారు. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింది కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126(2) కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు.

జడ్పీ సమావేశం నుంచి తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్తున్నారంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం అడ్డుకున్నారు. ఆమె వెళ్లే మార్గంలో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో మండల విద్యాధికారులతో ఎమ్మెల్యే హోదాలో కౌశిక్ రెడ్డి విద్యాశాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. అయితే అందులో పాల్గొన్న ఎంఈవోలకు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు మెమోలు జారీ చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ జడ్పీటీసీలు డీఈవోను సస్పెండ్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో ఆందోళన పెరుగుతుండడంతో కలెక్టర్ పమేలా సత్పతి తన కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే ఆమె ఎదుట నేలపై బైఠాయించారు.

TAGS