Bollywood actress : బాలీవుడ్ నటిపై కేసు.. సీఎంవో సీరియస్
Bollywood actress : బాలీవుడ్ నటిపై కేసులో ఏపీ పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంలో విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా, మాజీ డీసీపీ విశాల్ గున్ని హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసులో వీరి ప్రమేయం ఏ మేరకు ఉందనే దానిపై సీఎంఓ విచారణ జరుపుతోంది. ఇద్దరు ఐపీఎస్‌ల పాత్ర ఎంతమేరకు ఉందనే వివరాలను కోరింది. అంతేకాదుమాజీ సీపీ కాంతి రాణా, మాజీ డీసీపీ విశాల్ గున్ని సంజాయిషీ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ముంబైలో నమోదైన కేసు వివరాలను సేకరించే పనిలో ఏపీ పోలీసులు నిమగ్నమయ్యారు. ఐపీఎస్ అధికారులే ఇలాంటి వ్యవహారాలకు పాల్పడడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, మాజీ సలహాదారు సజ్జల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫిబ్రవరి 2, 2024 న, ఐపీఎస్ అధికారులు ఒక బాలీవుడ్ నటి, ఆమె కుటుంబాన్ని వేధించారని ఆరోపించారు.
ఈ విషయమై ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంవో అధికారులకు పూర్తి వివరాలు అందించారు. ఈ కేసుపై సీఎంఓ సీరియస్‌గా ఉంది. ఈ వ్యవస్థను మాఫియా తరహాలో వాడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకుంటే మున్ముందు వారు ఇంకా చెలరేగిపోతారనే వాదన వినిపిస్తోంది. అందుకే కేసు నుంచి బయటపడేందుకు సంబంధిత పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. అంతే కాకుండా నటి కాదంబరి జైత్వానీని కూడా తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే సంచలనంగా మారనుంది. అయితే ఆమె భయపడిపోయిందని.. పోలీసులు ఆమెకు హామీ ఇస్తే బయటకు వచ్చి జరిగినదంతా చెబుతారని అంటున్నారు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూస్తుంటే.. ఆ ఐపీఎస్ అధికారులను సర్వీసు నుంచి తొలగించేందుకు అవసరమైన ఆయుధాలు దొరికినట్లేనని భావిస్తున్నారు. ఈ విషయమై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్, సజ్జల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు.