KCR : సార్వత్రిక ఎన్నికల కోడ్ మొదలైంది. దీంతో పాటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు, కొన్ని అసెంబ్లీలో బైపోల్ కూడా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ తో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ స్థానంలో గెలిచిన లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. దీంతో బైపోల్ అనివార్యమైంది.
సిట్టింగ్ సీటును మళ్లీ తన ఖాతాలోనే వేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కానీ అధినేత కేసీఆర్ గతంలో అనుసరించిన విధానాలే శరాఘాతంగా మారనున్నాయని నియోజకవర్గం వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికను సైతం కాస్ట్లీ ఎన్నికగా మార్చింది కేసీఆరే. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకు కొత్త పథకాలు, ఓటర్లను డబ్బు ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా బీఆర్ఎస్ వెదజల్లిన డబ్బు ప్రవాహమే ఇందుకు ఉదాహరణ. ఈ రెండు నియోజకవర్గాల్లో హుజూరాబాద్ ను దక్కించుకోలేని బీఆర్ఎస్ మునుగోడును మాత్రం ఎలాగో ఒకలా తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అధికారంలో లేదు. వ్యవస్థలను మేనేజ్ చేసే అవకాశం అస్సలు కుదరదు. గతంలో ఆర్థిక వనరులను సమకూర్చిన వారు కూడా ప్రస్తుతం పార్టీ నుంచి వీడి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి ఆర్థిక వనరులు పరిపుష్టంగా అందుతాయనేది ఓపెన్ సీక్రెట్. బీఆర్ఎస్‌ను ఆర్థికంగా ఎదుర్కోనడం ఇప్పుడు కాంగ్రెస్ కు చాలా ఈజీ. గతంలో ఏ ఆర్థిక వనరులను ఉపయోగించి ఉప ఎన్నికల్లో ఎలాంటి గేమ్ ప్లాన్ చేసి ప్రత్యర్థి పార్టీలను కేసీఆర్ చిత్తు చేశారో.. కాంగ్రెస్ ఇప్పుడు అదే చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. కేసీఆర్ ప్రయోగించిన అస్త్ర, శస్త్రాలనే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వాడితే దానికి బాధ్యుడు కేసీఆరే. అదే సమయంలో బీఆర్ఎస్ మనీ పాలిటిక్స్ ను నాడు వ్యతిరేకించి ఇప్పుడు కాంగ్రెస్ అదే స్ట్రాటజీ అవలంభించడం ‘మార్పు’ అనిపించుకోదు.