Early Sleeping Tips : ప్రతీ మనిషికి ప్రతీ రోజు 7-8గంటల నిద్ర అవసరం. రోజంతా కష్టపడిన మనిషికి రాత్రి నిద్ర మాత్రమే ఉపశమనం. శరీర అవయవాలు విశ్రాంతి తీసుకుని మరలా పుంజుకునేందుకు నిద్ర తప్పనిసరి. అయితే కొంత మందికి నిద్ర పట్టదు. నిద్రలేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది దాంతో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే మున్ముందు పెద్ద సమస్యలు ఎదురవుతాయి. నిద్ర తొందరగా పట్టాలంటే ఈ చిట్కాలు పాటించండి..
– తిన్న వెంటనే నిద్ర పోవద్దు. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు అన్నం తినాలి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ లేదా వాంతులు వస్తాయి.
– కొందరు మంచి నిద్ర రావడానికి ఆల్కహాల్ తీసుకుంటారు. దీని వల్ల సమస్య తగ్గకపోగా మరిన్ని అనారోగ్య సమస్యలు దరిచేరుతాయి.
– రాత్రి పూట నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే పడుకునే ముందు బాదంపాలు తాగాలి. ఎందుకంటే ఇందులో మంచి నిద్రకు తోడ్పడే పోషకాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
-నిద్ర లేమి వేధిస్తుంటే చెర్రీస్ ను ప్రతీ రోజు మీ డైట్ లో కలిపి తీసుకోవాలి. ఎందుకంటే చెర్రీస్ లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. నిద్ర పోవడానికి ఒక గంట ముందు చెర్రీ రసం తాగాలి.
– నిద్ర రాకపోతే పడుకునే ముందు పసుపు పాలు తాగవచ్చు. ఈ పాలు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడమే కాదు నిద్ర కూడా బాగా వస్తుంది.
– నిద్ర పోవడానికి ధ్యానం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని తొలగించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. మెలటోనిన్, సెరోటోనిన్ లను పెంచుతుంది. రక్తపోటు, హృదయ స్పందనను కూడా తగ్గిస్తుంది.
-మంచి నిద్ర కోసం ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను పడుకునే ముందు అసలే వాడొద్దు. హాయిగా నిద్రపోయే ముందు 10 సార్లు దీర్ఘ శ్వాస తీసుకుని వదిలేయండి.
– నిద్ర బాగా పట్టాలంటే రాత్రిపూట త్వరగా పడుకోవాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.
వీటితో పాటు గదిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమలు రాకుండా చూసుకోవాలి. పది నిమిషాలు నచ్చిన పుస్తకం చదవండి. శ్రావ్యమైన సంగీతం వినండి. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. కాఫీ, టీలు తాగొద్దు.