Nirmala Sitharaman : అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేం.. ‘బడ్జెట్’పై నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman : కేంద్ర బడ్జెట్ లో వివక్ష చూపించారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేం కదా అని పేర్కొన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండియా కూటమి ధ్వజమెత్తింది. ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పార్టమెంటు లోపలా, బయటా నిరసన వ్యక్తం చేసింది. అయితే, ఈ ఆరోపణలపై నిర్మలా సీతారామన్ దీటుగా స్పందించారు. బుధవారం రాజ్యసభలో ప్రసంగిస్తూ.. బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమంటూ విపక్షాలను తిప్పికొట్టారు.

మహారాష్ట్రలోని వందవన్ లో పోర్టును ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ, నిన్నటి బడ్జెట్ లో మహారాష్ట్ర పేరును చెప్పలేదు. అలాగని, తమను విస్మరించారని ఆ రాష్ట్రం భావిస్తోందా? బడ్జెట్ ప్రసంగంలో ఓ రాష్ట్రం పేరును ప్రస్తావించనంత మాత్రాన.. కేంద్రం నుంచి వారికి నిధులు వెళ్లవా? విపక్షాలది దారుణమైన ఆరోపణ. తమ రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని నిర్మలమ్మ దుయ్యబట్టారు.

ఆమె సమాధానంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘బడ్జెట్ లో రాష్ట్రాల మధ్య సమతుల్యత లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది? దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై నిరసన తెలియజేస్తాం’’ అని అన్నారు.

TAGS