Lok Sabha Elections : అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలల కూడా తిరగకముందే లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. డబ్బులు ఖర్చు పెట్టలేక వారు లబోదిబోమంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనాన్ని సమీకరించుకున్నంత ఉత్సాహంగా.. లోక్‌సభ ఎన్నికల్లో సమీకరించడం లేదని పలు పార్టీల పెద్ద నాయకులు చెబుతున్నారు.
ఇటీవల రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు నిర్వహించిన సభలకు జనసమీకరణ కోసం.. పలు జిల్లాల్లో నియోజకవర్గ స్థాయి నాయకులకు ఒకటికి పది సార్లు ఫోన్లు చేసి గట్టిగా చెప్తే గానీ పని కావడం లేదని ఆ పార్టీల నాయకులు తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడి మరీ జనసమీకరణ చేసిన నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. డబ్బు సమకూరిస్తేనే ఏ పనైనా చేయగలమని.. లేదంటే తమ వల్ల కాదని చెబుతున్నట్లు సమాచారం.
భవిష్యత్ ఏంటో అర్థం కాక..
‘లోక్‌సభ ఎన్నికలతో మాకేం ఒరుగుతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులే ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఖర్చు చేయాలంటే మావల్ల కాదు.. కార్యక్రమాలకు రాలేం..’ అంటూ సెకండ్ కేటగిరి నాయకులు పార్టీలకు దూరంగా ఉంటున్నారని దక్షిణ తెలంగాణలో ఓ పార్టీ నేతలు వాపోయారు. ప్రచారం ఊపందుకోవాల్సిన తరుణంలో కింది నాయకులు చేతులెత్తేస్తుండడం తలనొప్పిగా మారింది. పార్టీలో ప్రాధాన్యత కోసం అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీపడి మరీ డబ్బు ఖర్చు చేసినవారు.. ఇప్పుడు ప్రత్యర్థులు పార్టీలో చేరుతుంటే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. రాజధాని పరిధిలో తమ భవిష్యత్ ఏంటో అర్థం కాక.. మరోసారి ఖర్చు చేసేందుకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది.
రీసెంట్ గా నిర్వహించిన తమ పార్టీ భారీ సభకు ఉత్తర తెలంగాణకు చెందిన నాయకుడు జనాన్ని తరలించేందుకు రూ. 10 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాడట. అయితే, పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదట. మరో సభకు కూడా జనాన్ని పంపాలని కోరడంతో సదరు నాయకుడు ముఖం చాటేస్తున్నాడు. ఇప్పటికే రూ. అర కోటి పెట్టుబడి పెట్టగా.. ప్రత్యర్థులు పార్టీలో చేరడం కష్టంగా మారిందని మరో నాయకుడు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రూ. కోటిన్నర పెట్టుబడి పెట్టిన ఓ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుడు.. లోక్‌సభ ఎన్నికల ఖర్చు తన వల్ల కాదని చేతులెత్తేస్తున్నాడు. మంచి రోజులొస్తాయని నాయకులు బుజ్జగించినా.. పార్టీ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు చేయడం లేదని తెలుస్తోంది.
సభ అంటే కనీసం 3వేల మందినైనా తీసుకురావాలని నాయకులను పార్టీలు ఆదేశిస్తున్నాయి. లారీలు, వ్యాన్లకు అద్దెలతో పాటు మద్యం, బిర్యాణి పొట్లాలు, నగదు ఇలా ఒక్కో సభకు రూ.20 లక్షలకు తగ్గకుండా ఖర్చవుతుందని నాయకులు వాపోతున్నారు.
ఎండ తీవ్రత రాను రాను పెరుగుతుండడంతో ఆర్టీసీ బస్సులైతేనే వస్తామని ప్రజలు చెప్పడం.. అదనపు భారంగా ఫీల్ అవుతున్నారు. ప్రైవేటు వాహనాలైతే ఎవరో ఒకరిని బతిమిలాడి.. డీజిల్ పోసుకొని తెచ్చుకోవచ్చు, ఆర్టీసీ బస్సు లైతే ముందే డబ్బులు కట్టాలి. నిర్దిష్ట గంటలు దాటితే అదనపు చెల్లింపులు తట్టుకోవడం కష్టమేనని వాపోతున్నారు.