Independent Candidate Protest : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ అనుచరులు, పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీలు చేస్తున్నారు. తమకు ప్రజల మద్దతు ఉందని నిరూపించుకునేందు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఖర్చు ఎంతైనా పర్వాలేదని ముందుకు సాగుతున్నార. ఎంతయినా ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు బరిలో ఉన్న అభ్యర్థులు.
ప్రధాన పార్టీల అభ్యర్థులకైతే ప్రచారం ఖర్చు తడిసి మోపడవుతున్నది. పొద్దున, సాయంత్రం ర్యాలీలు, రోడ్డుషోలతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు భారీగా జన సమీకరణ చేయడం అభ్యర్థుల అనుచరులకు కూడా కష్టసాధ్యమవుతుంది. ఒకే రోజు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం సాగుతుండడంతో ఒక్కొక్కరికి రూ. 500 నుంచి రూ.1000 వరకు ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. జన సమీకరణ తక్కువగా ఉంటే తమకు క్షేత్రస్థాయిలో మద్దతు లేదని ప్రజలు భావిస్తున్నారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రచారానికి వెళ్తన్నామంటే ముందుగానే జన సమీకరణకు భారీగా ఖర్చు చేస్తున్నారు. వచ్చిన వారికి టిఫిన్లు, భోజనాలు, రోజు వారి డబ్బులతో పాటు కొందరికి అదనంగా మందు కూడా పంపిణీ చేసేందుకు వెనకాడడం లేదు. అదే సమయంలో పార్టీలో చేరికలకు కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుడి వరకు ఇంత అని రేటు ఫిక్స్ చేసి అతడిని పార్టీలో చేర్చకుంటున్నారు. పార్టీలో చేరే వ్యక్తితో పాటు అతని అనుచరులకు కూడా ఎంతో కొంత ముట్టజెబుతున్నారు.
దీంతో చిన్నపార్టీలు, ఇండిపెండెంట్లుగా బరిలో దిగిన వారు దిగులు చెందుతున్నారు. తమతో ప్రచారానికి వచ్చేవారు కానరాక, డబ్బలు పంచే స్థోమత లేక మిన్నకుండిపోతున్నారు. తమకున్న ఐదారుగురితోనే ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బెల్లపు కరుణాకర్ నిరసనకు దిగాడు. వేలకు వేలు డబ్బులు ఇచ్చి తన వెంట జనాన్ని తిప్పుకోలేనని, చేరికలకు తన వద్ద డబ్బులు లేవని నిరసన తెలిపాడ. వేలకు వేలు డబ్బులు ఇస్తున్న వారితో పాటు తీసుకున్నవారి వైఖరిని తప్పుబడుతున్నాడు. మోకాళ్లపై కూర్చొని తన నిరసన వ్యక్తం చేశాడు. ఆర్థికంగా లేని తనకు ప్రజలు సహకరించాలని కోరుతున్నాడు.