Afghanistan Vs Uganda : టీ 20 వరల్డ్ కప్ లో అఫ్గానిస్తాన్, ఉగాండాల మధ్య భారత కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అఫ్గానిస్తాన్ లో ప్రస్తుతం స్టార్ క్రికెటర్లు ఉన్నారు. రషీద్ ఖాన్, నబీ, ముబీబ్ రెహమన్, రహ్మనుల్లా గుర్జాబ్ లాంటి ప్లేయర్లు ఇంటర్నేషనల్ క్రికెట్ లో సత్తా చాటుతున్నారు. కొంతమంది ఐపీఎల్ తో పాటు వివిధ ప్రాంచైజీల తరఫున ఆడుతూ.. విపరీతంగా ఫేమస్ అయ్యారు.
ఉగాండా టీం ఆఫ్రికా క్వాలిఫైయర్స్ లో భాగంగా జింబాబ్వేను ఓడించి టీ20 వరల్డ్ కప్ నకు అర్హత సాధించింది. అయితే ఉగాండా గతేడాది 35 టీ 20 మ్యాచులు ఆడగా.. 30 మ్యాచుల్లో గెలిచి వరల్డ్ కప్ కు క్వాలిఫై అవడానికి కారణంగా నిలిచింది. గతేడాది ఆడిన అన్ని మ్యాచుల్లో ఉగాండా ఆఫ్రికాలో ఆధిపత్యం కనబర్చింది. ఉగాండా స్పిన్నర్ నసుబా 43 సంవత్సరాలు టీ 20 క్రికెట్ లోనే అత్యంత పెద్ద వయస్కుడిగా ఆడనున్నారు.
అయితే 2009 డివిజన్ 3 క్వాలిఫైయర్ లో భాగంగా అఫ్గానిస్తాన్ పై ఉగాండా గెలిచిన అనుభవం ఉంది. అప్పటి టీంలో నసుబా చెలరేగి ఆడి 66 పరుగులు చేసి ఉగాండాను గెలిపించాడు. 2009 నాటి మ్యాచ్ లో మహమ్మద్ నబీ కూడా అఫ్గాన్ టీంలో ఉన్నాడు. ఈ డివిజన్ మ్యాచ్ లో ఉగాండా గెలిచినా.. ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో సరిగా ఆడలేక మరింత కిందకు పడిపోయింది.
కానీ అఫ్గానిస్తాన్ రోజు రోజుకు మరింత మెరుగుపడి టాప్ 10 లో స్థానం దక్కించుకుంది. ఒకప్పటి కెన్యా, జింబాబ్వే, కెనడాలను దాటి అఫ్గానిస్తాన్ టాప్ 10 ర్యాంకింగ్ లో సుస్థిరం చేసుకుంది. అయితే ఉగాండాను తక్కువ అంచనా వేస్తే మాత్రం జింబాబ్వేకు పట్టిన గతే అఫ్గానిస్తాన్ కు పడుతుంది. ఎందుకంటే ఉగాండాలో ఎవరూ ఎలా ఆడతారో చెప్పలేం. వారి ఆట కూడా సరిగా ఎవరికి తెలియదు. కాబట్టి అఫ్గానిస్తాన్ జాగ్రత్తగా ఆడాలని ఆ టీం ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.