YSR : చనిపోయిన వైఎస్ఆర్ మళ్లీ కాంగ్రెస్ ను బతికించగలడా?

YSR : ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. కొందరు ఎలాంటి గుర్తింపు లేకుండా కాలగర్భంలో కలిసిపోతుంటే.. మరికొందరు వారి గుర్తులను కొన్ని తరాల వరకు విడిచిపెడుతుంటారు. వారితో పార్టీలకు బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ముందు తరాల నాయకులు వారి పేరుతోనే రాజకీయాలు చేస్తుంటారు. బీజేపీకి ఒకప్పుడు వాజపేయి, అద్వాని, టీడీపీకి ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్‌కు ఒకప్పుడు ఇందిరా, ఇప్పుడు రాహుల్, బీఆర్ఎస్‌కు కేసీఆర్‌ ఇలానే చూసుకుంటే ఉమ్మడి ఏపీకి వైఎస్సార్.

రాజకీయాలలో ఇది సాధారణ విషయమే. ఏపీలో పదేళ్ల నుంచి ఊసేలేని కాంగ్రెస్ పార్టీని అంతకంటే ముందే చనిపోయిన వైఎస్ఆర్ బతికించగలరా? అంటే అవునంటున్నారు షర్మిల. అందుకే జూలై 8న విజయవాడలో వైఎస్ఆర్ 75వ జయంతిని అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఇంకా పలువురు కాంగ్రెస్‌ ప్రముఖులను ఆమె ఆహ్వానిస్తున్నారు.

తెలంగాణలో ‘తెలంగాణ సెంటిమెంట్’ బలంగా ఉందన్న సంగతి గ్రహించకుండా ‘రాజన్న రాజ్యం’ తెస్తానంటూ మూడేళ్ల పాటు పాదయాత్రల పేరుతో చెప్పులరిగేలా తిరిగినా ఫలితం మాత్రం దక్కలేదు. అదే తప్పును ఆమె ఏపీలో చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయం పక్కనపెట్టి తన అన్నలాగే చెట్టు పేరు చెప్పి పండ్లు అమ్ముకోవచ్చన్నట్లు వ్యవహరిస్తున్నారు.

అయితే వైఎస్ఆర్ పేరును వాడేసుకొని జగన్ సీఎం కాగలిగారు. కానీ తండ్రి స్థాయిని చేరుకోలేకపోగా ఐదేళ్ల అరాచక పాలనతో తండ్రి పేరు కూడా చెడగొట్టారు. కాబట్టి ఏపీలో ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి..? పార్టీల నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు. అసలు ప్రజలు తమ నుంచి పార్టీలు ఏం ఆశిస్తున్నాయి? అనే విషయాలను పట్టించుకోకుండా వైఎస్ షర్మిల తన తండ్రి పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను తనవైపునకు తిప్పుకోగలరా? వైఎస్ఆర్ పేరు చెప్పుకొని ఏపీ కాంగ్రెస్‌ను బతికించగలదా? లేదంటే వైఎస్ ఆమెను, ఏపీలో కాంగ్రెస్ ను కాపాడగలరా? సాద్యం కాకపోవచ్చు.

నిజానికి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన జగన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో గ్రహించలేకపోయారు. అవి తెచ్చాను.. ఇవి తెచ్చాను.. అంటూ ఓటమి స్పీచ్ ఇచ్చిన జగన్ పాలన ఎంత ప్రశాంతంగా ఉండాలో తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు గద్దె దిగినా కూడా ఆయన ఇంకా తెలుసుకోలేదు.

ప్రజలకు ఏం కావాలో బాబు, పవన్ పట్టుకున్నారు కాబట్టే ప్రజలు వారికి అధికారం అప్పగించారు. కనుక వైఎస్ షర్మిల కూడా రాణించాలనుకుంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగాలే తప్ప చెట్టు పేరు చెప్పి పండ్లు అమ్ముకునే మాదిరి తండ్రి పేరు చెప్పుకొని ఎంత తిరిగినా ప్రయోజనం ఉండదని గ్రహిస్తే మంచిది.

TAGS