Ratan Tata : రతన్ టాటాకు కేబినెట్ నివాళి.. ముంబై వెళ్లిన సీఎం చంద్రబాబు

Ratan Tata Tribute AP Cabinet
Ratan Tata : దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైన వెంటనే రతన్ టాటాకు నివాళులర్పించింది. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రతన్ టాటా చిత్రపటానికి పూలు వేసి సీఎం చంద్రబాబు, మంత్రులు నివాళులు అర్పించారు.
అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ముంబై బయల్దేరి వెళ్లారు. అక్కడ రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. కాగా, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుండగా, సాయంత్రం 6 గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.