Telangana : తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు, రేపు సూర్య తాపం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు రోజులు వడగాడ్పులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వృద్ధులు, చిన్నారులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు నిన్న వడదెబ్బకు గురై రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందారు.
గత నెల నుంచి తెలంగాణలో కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే 43 నుంచి 45 డిగ్రీలు దాటేశాయి. మధ్యాహ్నం సమయంలో వడగాలులు వీస్తున్నాయి. రాగల రెండు, మూడు రోజులు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.