Budget 2024 : 57 నిమిషాల్లో బడ్జెట్ ప్రసంగం..నిర్మలా ప్రసంగాల్లో అతి చిన్నది ఇదే..ఇంకా ఎన్నో రికార్డులు..

Budget 2024 speech in 57 minutes

Budget 2024 speech in 57 minutes

Budget 2024 : దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సారి మధ్యంతర బడ్జెట్ ను మాత్రమే ప్రవేశ పెట్టారు. కేంద్ర బడ్జెట్ ను నిర్మలా ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి. అయితే గతంతో పోలిస్తే తన ప్రసంగాన్ని గంటలోపే ముగించడం గమనార్హం.

నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఇప్పటి వరకు చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఈ సారే అతి తక్కువ సమయం మాట్లాడారు. ఈసారి ఆమె దేశ పద్దును కేవలం 57 నిమిషాల్లోనే లోక్ సభ వేదికగా దేశ ప్రజల ముందు వినిపించారు.

పార్లమెంట్ లో ఎక్కువ సార్లు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా.. అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా పేరు మీదనే ఉంది. 2020-21 బడ్జెట్ ప్రవేశ పెడుతూ 162 నిమిషాల(2గంటల 42 నిమిషాలు) పాటు ఆమె ప్రసంగించారు. అప్పుడు ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం కావడం విశేషం.

కాగా, 2019-20 బడ్జెట్ లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివి పరంగా రెండో అతి పెద్దది. అంతకు ముందు 2003-04 బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన జశ్వంత్ సింగ్ 135 నిమిషాల పాటు మాట్లాడారు. గతేడాది నిర్మలా సీతారామన్ 86 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు.

ఇక 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్.. పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. అదే ఏడాది కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆమె.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తొలి మహిళగా కీర్తిగడించారు. ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇక మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్ లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మరో రికార్డు నెలకొల్పారు.

TAGS