Nirmala Sitharaman : Budget 2024 అవే పన్నులు మళ్లీ..ఉద్యోగులకు ఊరట ఇవ్వని నిర్మలమ్మ పద్దు..
Nirmala Sitharaman : సార్వత్రిక ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర(తాత్కాలిక) బడ్జెట్ ను గురువారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. టాక్స్ పేయర్లు ఎంతగానో ఎదురుచూసే పన్ను విధానాల్లో మాత్రం ఏ మార్పు చేయలేదు. ఆదాయ పన్ను కొత్త విధానంలో వారికి రూ.7లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదని చెప్పారు. ఇది 2013-14 సంవత్సరంలో రూ.2.2లక్షలుగా ఉందని గుర్తు చేశారు.
కార్పొరేట్ పన్నును దేశీయ కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి.. కొన్ని రకాల తయారీ రంగ సంస్థలకు 15 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. ప్రజల సగటు వాస్తవిక ఆదాయం 50 శాతం పెరిగినట్లు చెప్పారు.
ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదస్పద డిమాండ్ నోటీసులు అందుకున్న వారికి ఊరట నిచ్చారు. 2009-10 మధ్య రూ.25వేల వరకు విలువైన డిమాండ్ నోటీసులను ఉపసంహరించుకున్నారు. 2010-11 నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ.10వేల వరకు చెల్లించాలని జారీ అయిన నోటీసులను రద్దు చేశారు. దీంతో దాదాపు కోటి మంది లబ్ధి పొందనున్నట్లు ఆమె తెలిపారు. వ్యాపారాలను సరళ తరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా చెప్పారు. ఈక్రమంలో చిన్న మొత్తంలో ఉన్న ప్రత్యక్ష పన్ను వివాదస్పద డిమాండ్ల(నోటీసులు)ను రద్దు చేసుకుంటున్నట్లు వివరించారు.
ప్రతిపాదిత కొత్త పన్ను విధానం:
ఆదాయం పన్ను శ్లాబు
రూ.3లక్షల వరకు –
రూ.3-6 లక్షలు 5శాతం
రూ.6-9 లక్షలు 10శాతం
రూ. 9-12లక్షలు 15శాతం
రూ. 12-15లక్షలు 20శాతం
రూ. 15లక్షలు, ఆపైన 30శాతం
వేతన జీవులు ఐటీఆర్ దాఖలులో కొత్త ఐటీ విధానాన్ని ఎంచుకుంటే ఎటువంటి పొదుపు, పెట్టుబడి పథకాల్లో మదుపునకు రాయితీలు ఉండవు. రూ.7లక్షల ఆదాయం దాటిన వారు శ్లాబ్ ఆధారంగా పన్ను చెల్లించాల్సిందే. ఇక ఇంటి రుణం, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, విద్యా రుణం తదితర రూపాల్లో ఆదాయం పన్ను చట్టం-1961లోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపుల్లో మార్పులు, చేర్పులు చేశారు.