Budget 2024: ఎన్నికల ముందు రైతులకు గుడ్ న్యూస్..!
- పీఎం కిసాన్ యోజన నగదు పెంపు..ఇంకా ఎన్నెన్నో..
Budget 2024 : భారత దేశమంటేనే వ్యవసాయం. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఎన్ని ఆర్థిక మంద్యాలు వచ్చినా దేశం తట్టుకోగలుగుతుంది అంటే కారణం వ్యవసాయ దేశం కావడమే. దేశంలోని దాదాపు సగం మందికిపైగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడ్డారు. అయితే రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడినా వారికి ఏమాత్రం ప్రయోజనం ఉండడం లేదు. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నారు తప్పా పెద్దగా మిగులు ఉండడం లేదు.
అందుకే ప్రభుత్వాలు రైతుల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. పంటలకు మద్దతు ధరలు, తక్కువ వడ్డీకే రుణాలు, విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నాయి. ఇక కేంద్రం పీఎం కిసాన్ నిధి అనే నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
మరో రెండు, మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈక్రమంలో రైతులను ఆకట్టుకోవడానికి కేంద్రం కొన్ని పథకాలు అమలుచేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ లో వీటిని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ లో రైతులకు ఇచ్చే రుణ పరిమితి పెంచే అవకాశం ఉంది.
2023 డిసెంబర్ నాటికి కేంద్రం రూ.20లక్షల కోట్ల మేర రైతు రుణాలను పంపిణీ చేసింది. ఈ రుణాలను రూ.22-25 లక్షల కోట్లకు పెంచాలని యోచిస్తోంది. అగ్రిటెక్ స్టార్టప్ లకు కనీసం 10-15 సంవత్సరాల పాటు ప్రత్యేక ట్యాక్స్ డిస్కౌంట్ ఇవ్వాలని భావిస్తోంది. రైతుల ఆదాయాలు పెరగాలంటే ఆర్థిక, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉంది.
అన్నదాతలు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా పెంచాలని డిమాండ్ ఉంది. దీనిపై కూడా బడ్జెట్ లో ఏవైనా ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది. దేశీయంగా తయారు చేసిన ఎరువులపై సబ్సిడీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రకాల ఎరువులపై సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీని మరింత పెంచే అవకాశం కనపడుతోంది. అలాగే పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే రూ.6వేలను రూ.8వేలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. ఈ ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా అందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ ప్రభుత్వం రైతుభరోసా కింద ఏడాదికి ఎకరాకు రూ.15వేలు ఇవ్వనుంది.