Lakshadweep : మొన్నటిదాక వార్తల్లో నిలిచిన లక్షద్వీప్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఇవాళ తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను ప్రచారం చేయడానికి వీలుగా దీర్ఘకాలిక రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. లక్షద్వీప్ లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధ్యానమిస్తోందన్నారు.
ఇంకా మంత్రి మాట్లాడుతూ..పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. భారత్ లోని 60 చోట్ల నిర్వహించిన జీ-20 సమావేశాలు ఇక్కడి వైవిధ్యాన్ని ప్రపంచ పర్యాటకులకు చాటాయన్నారు. దేశాన్ని వ్యాపారాలకు కేంద్రంగా చేయడంతో పాటు.. కాన్ఫరెన్స్ టూరిజాన్ని ఆకర్షించాలన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకం కారణంగా స్థానిక వ్యాపారాలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయన్నారు. ఆకర్షణీయమైన ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామన్నారు. వాటిని ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ చేస్తామన్నారు.
వసతులు, నాణ్యమైన సేవలు ఆధారంగా ఈ పర్యాటక కేంద్రాలకు రేటింగ్ ఇచ్చేలా ఒక ఫ్రేమ్ వర్క్ ను సిద్ధం చేస్తామన్నారు. దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్ ఫ్రా, ఇతర వసతులను మన దీవుల్లో ఏర్పాటు చేస్తామని నిర్మలా తెలిపారు. వీటిలో లక్షద్వీప్ కూడా ఉందని, ఇది ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పుకొచ్చారు.
కాగా జనవరి మొదటి వారంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి అందాలపై ఆయన తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దేశంలోని పర్యాటకులు కూడా ఇక్కడ పర్యటించాలని కోరారు. దీంతో మాల్దీవుల మంత్రులు తమ అక్కసు వెళ్లగక్కడం.. ‘‘బాయ్ కాట్ మాల్దీవ్స్’’ నినాదం దేశవ్యాప్తంగా పాకిపోవడం తెలిసిందే. ఆ తర్వాతి పరిణామాలతో మాల్దీవులకు మన టూరిస్టుల సంఖ్య భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో మాల్దీవులకు దీటుగా లక్షద్వీప్ ను తీర్చిదిద్దే పనిలో కేంద్ర ప్రభుత్వం పడింది.