Minister Nimmala : ఏపీలో గత ప్రభుత్వ పాపం, నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలొచ్చాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బుడమేరు వాగుకు వచ్చిన వరదలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మంత్రి తెలిపారు. గత ఐదేళ్లలో బుడమేరు డైవర్షన్ కెనాల్ పనుల పూర్తికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఒకేసారి 15 వేల క్యూసెక్కుల నీరు రావడంతో గండ్లు పడి వరదలు వచ్చాయని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలొచ్చాయని, భవిష్యత్తులో వరదలు రాకుండా ఆపరేషన్ బుడమేరు చేపడతామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను జలవనరుల శాఖ తీసుకుంటుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతిరోజు గోదావరి హారతి నిర్వహించాలని తాము నిర్ణయించామన్నారు.