BRS Strangle : బీఆర్ఎస్ కంచుకోటకు బీటలు..పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు..అసలేం జరుగుతోంది..?

BRS Strangle

BRS Strangle

BRS Strangle : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ కార్పొరేషన్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ నుంచి ‘హస్త’గతమయ్యాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సొంత పార్టీ మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం ప్రకటిస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ చేతుల్లోంచి కాంగ్రెస్ పరమయ్యాయి. ఇంకా మరెన్నో హస్తగతం కావడానికి సిద్ధమయ్యాయి. అధికారంలోని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు.

ఈ జాబితాలో బీఆర్ఎస్ కంచుకోట అయిన కరీంనగర్ కార్పొరేషన్ కూడా చేరే అవకాశాలు కనపడుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్పొరేటర్లు పార్టీని చీల్చే దిశగా పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆడిందే ఆట..గా అరాచకాలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. 9మంది కార్పొరేటర్లు ఇప్పటికే హస్తం పార్టీతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.

కరీంనగర్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ అండగా బీఆర్ఎస్  కార్పొరేటర్లు, నేతలు పదేళ్లు అరాచకాలు చేశారు. పేద, మధ్యతరగతి జనాల భూములను కబ్జా చేసి, సెటిల్ మెంట్ల పేరుతో డబ్బులు వసూలు చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో రియల్ ఎస్టేట్ దందాలు చేసి కోట్లకు పడగలెత్తారు. ఇక మాజీ మంత్రి గంగుల కూడా తక్కువేం తినలేదు. తన అనుచరులు చేస్తున్న అరాచకాలను అడ్డుకోకపోగా, అండగా నిలిచారు. ఇక జర్నలిస్టుల ఇళ్ల పట్టాల పేరుతో ఎస్సారెస్పీ భూములకు గంగుల ఎసరు పెట్టారు. మూడెకరాలను జర్నలిస్టులకు పంచి 10 ఎకరాలు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆ పనిని పూర్తిచేసేవారే. ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో గుట్టురట్టయ్యింది.

పదేళ్లు కరీంనగర్ లో బీఆర్ఎస్ నాయకులు సాగించిన అరాచకాలపై ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణితో పాటు, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంత్రి పొన్నం సదరు దందాలపై నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. ఈమేరకు వారు కబ్జాల చిట్టాను తయారు చేస్తున్నారు.

దీంతో కబ్జానేతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే భూ కబ్జా కేసులో కార్పొరేటర్ తోట రాములు, బీఆర్ఎస్ నాయకుడు తోట రాములు అరెస్ట్ అయ్యారు. దీంతో తమ వంతు ఎప్పుడు వస్తుందోనని వణికిపోతున్నారు. ఈక్రమంలో కొందరు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు దారులు వెతుక్కుంటున్నారు. అయితే ఈ కబ్జా నేతలను పార్టీలో చేర్పించుకుంటారా? బీఆర్ఎస్ మురికిని కాంగ్రెస్ కు అంటించుకుంటారా? మంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

TAGS