BRS Self goal : బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్..ఆ స్కీంలపై కూడా విచారణ తప్పదా?
BRS Self goal : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడీగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మాటల యుద్ధంతో సభాపర్వం ఘాటుగా మారుతోంది. ఇవాళ జరిగిన సమావేశాల్లో హరీశ్ రావు వర్సెస్ కాంగ్రెస్ సర్కార్ అన్నట్టుగా మారిపోయింది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అమలు చేయాలని హరీశ్ ప్రభుత్వానికి సూచించారు. ఈనేపథ్యంలో జరిగిన చర్చల్లో సీఎం రేవంత్ ప్రసంగించారు.
‘‘అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రూపొందించిన బడ్జెట్ ను హరీశ్ స్వాగతించకుండా విమర్శలు చేయడం సరైంది కాదు. బీఆర్ఎస్కు నిజాయితీ ఉంటే బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీ పథకంపై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలి’’ అని సవాల్ విసిరారు. ఇప్పటికే గొర్రెల స్కాంపై విచారణ ప్రారంభమైందని, వీటికి తోడు బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్ లోనూ అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో త్వరలోనే విచారణకు ఆదేశించనున్నారని తెలుస్తోంది.
కాగా, బతుకమ్మ చీరల తయారీ టెండర్ సూరత్ కు అప్పగించడం వెనక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని కాంగ్రెస్ గతంలోనే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నిధుల గోల్ మాల్ జరిగిందని ఆరోపించింది. అధికారంలోకి వచ్చాక లెక్క తేల్చుతామని అప్పట్లోనే ప్రకటించింది. ఈ సమయంలోనే సీఎం రేవంత్ మాట్లాడుతూ..విచారణకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ చేయడంతో ఈ విషయంలో విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కనపడుతోంది.
గతంలో కూడా బీఆర్ఎస్ నేతలు విద్యుత్ విషయంలో ఇలాగే మాట్లాడితే..దానిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చర్చల్లో గత పథకాలను గురించి ప్రస్తావనకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతామనుకుంటే..వాటిపై విచారణ చేయిస్తామని సీఎం ఎదురుదాడి చేసి..బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టడం గమనార్హం. ఈ పథకాల్లో విచారణ చేయిస్తే ఎన్ని అక్రమాలు బయటపడుతాయో..ఎవరెవరి హస్తాలు ఉన్నాయో..ప్రభుత్వ ఖజానాకు ఎంత బొక్క చేశారో తెలియనుంది.