BRS : రియాలైజ్ అయ్యారా? లోక్ సభ ఎన్నికల స్టంటా?
BRS : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే.. మూడోసారి హ్యాట్రిక్ పక్కా అని బీఆర్ఎస్ నేతలు హల్ చల్ చేశారు. ఓటర్లు మాత్రం వారిని ప్రతిపక్షానికే పరిమితం చేశారు. బీఆర్ఎస్ ఎలాగైనా గెలుస్తుంది.. కనీసం ఎంఐఎం సపోర్ట్ తోనైనా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీనేతలు, చాలా మంది విశ్లేషకులు, జనాలు సైతం అనుకున్నారు. కానీ నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు..ఇలా కొన్ని వర్గాలు గంపగుత్తగా కాంగ్రెస్ కు ఓట్లు వేయడంతో బీఆర్ఎస్ కు పరాజయం తప్పలేదు.
బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం.. వారి అహంకారం అని తెలంగాణలో ఏ పోరగాన్ని అడిగినా చెబుతాడు. వారి ప్రవర్తన మార్చుకుంటే నేడు ప్రతిపక్షంలోకి వచ్చిఉండేవారే కాదు. 10ఏండ్లుగా నిరుద్యోగులను చిన్న చూపు చూస్తూ.. వారి ఓట్లు తమకేం అవసరం లేదన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ ప్రవర్తించారు. చివరకు ఉద్యోగ పరీక్షల లీకేజీలు, రద్దు, వాయిదాలతో నిరుద్యోగులు నైరాశ్యంలో ఉంటే పాలకులుగా కనీసం భరోసా కల్పించలేకపోయారు. ఇక మ్యానిఫెస్టోలోనైతే నిరుద్యోగులు అనే పదమే లేకుండా చేశారు. దీంతో నిరుద్యోగులు తమకు ఉద్యోగం ఇవ్వని కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని కంకణం కట్టుకున్నారు. ఊరూరూ తిరిగారు.. చివరకు కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టారు. అహంకారమే వారిని పదవీచిత్యులను చేసిందనడానికి నిరుద్యోగుల ఉదంతమే కారణం.
వారి అహంకారానికి ఇంకా ఎన్నెన్నో కారణాలు చూపించవచ్చు. సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లరు..తన దగ్గరకు రానివ్వరు.. కనీసం మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరు. సామాన్యుడు ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టలేడు. ఇవన్నీ పోరాట స్వభావమున్న తెలంగాణ ప్రజలకు రుచించలేదు. అహంకారపూరితంగా వ్యవహరిస్తే ఎవరినైనా గద్దె దించుతామని నిరూపించారు.
ఇవన్నీ బాగా పరిశీలించిన రేవంత్ రెడ్డి..తెలంగాణ ప్రజలతో అహంకార పూరితంగా ఉంటే నడువదు..అని దాదాపు ఫిక్స్ అయ్యారు. అందుకే సీఎం ప్రోటోకాల్ పక్కన పెట్టేశారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ చేశారు. సామాన్యులను కలుస్తున్నారు. మంత్రులు తమను ‘‘అన్నా, అక్కా’’ అని అనమంటున్నారు. ఇలా కాంగ్రెస్ నేతలు తమకు అహంకారం లేదు.. మేము ప్రజల మనుషులం అని చెప్పే తీరుగా ప్రవర్తిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమిని విశ్లేషించుకున్న కేసీఆర్, కేటీఆర్ లకు విషయం బోధపడినట్టుంది. తాజాగా వారు కూడా సామాన్యుల జపం చేస్తున్నారు. కొత్త సంవత్సరం తొలి రోజున కేటీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయంలోకి పారిశుధ్య కార్మికులను ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. వారితో సెల్ఫీ లు దిగారు. ఇక కేసీఆర్ కూడా తన దగ్గరకు వచ్చిన జనాలతో మాట్లాడుతున్నారు.
నేతల్లో ఒక్కసారిగా ఇంతలా మార్పు వచ్చిందని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇది అసెంబ్లీ ఎన్నికలు తెచ్చిన మార్పా? లేదంటే త్వరలో జరుగబోయే లోక్ సభ ఎన్నికల స్టంటా? అని అనుమానిస్తున్నారు. ఇంకా సదరు నేతలు తమ అహంకారాన్ని తగ్గించుకోవాలని.. అప్పుడే జనాలకు దగ్గరవుతారని ప్రత్యర్థులు సూచిస్తున్నారు.