BRS Operation 3 Months:తెలంగాణలో ముచ్చటగా మూడవసారి అధికారం మాదేనని, ఈ సారి కచ్చితంగా హ్యాట్రిక్ సాధించి మరో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గులాబీ దళపతి కేసీఆర్ ధీమాని వ్యక్తం చేశారు. గులాబీ నేతలు కూడా అధినేత చెప్పింది నూటికి నూరు శాతం జరుగుతుందని గట్టి నమ్మంతో ఎదురుచూశారు. కానీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ లెక్క తప్పింది.. ఫలితం తారు మారైంది. ఊహించని విధంగా అధికారంలోకి రాదనుకున్న కాంగ్రెస్ ఘనవిజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందరికి షాక్ ఇస్తూ రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు.
అయినా సరే గులాబీ నేతల్లో అధికారంపై ఆశచావలేదు. కాంగ్రెస్ 64 సీట్లు సాధించి అధికారాన్ని చేపట్టినా ప్రభుత్వం మూడు నెలల్లో కుప్పకూలడం ఖాయం అని, అంత వరకు మౌనంగా ఉండండని, ఏది జరగాలో అది జరుగుతుందని, ప్రభుత్వాన్ని నడపలేక కాంగ్రెస్ వర్గాలు చేతులు ఎత్తేయడం ఖాయం అని ఫైనల్‌గా మన చేతికి మళ్లీ అధికారం దక్కడం పక్కా అనే విధంగా గులాబీ వర్గాలు బాహాటంగానే ప్రకటించడం తెలిసిందే. `సింహం ఓ అడుగు వెనక్కి వేసింది కదా అని పొరపాటు పడొద్దు.. కేసీఆర్ అనే సింహం కచ్చితంగా బయటకు వస్తుంది. మేం తలుచుకుంటే మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది. మాతో బీజేపీ, ఎంఐఎం కలిస్తే కచ్చితంగా అధికారం చేపడతాం` అంటూ గులాబీ సీనియర్ నేత కడియం శ్రీహరి ప్రకటించడం తెలిసిందే.
దీనిపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. `అధికారం చేపట్టి కాంగ్రెస్‌కు, అధికారం చేజారి మీకు వారమైనా కాలేదు అప్పుడే అధికారం కోసం ఇంతగా దిగజారాలా? ` అని మేధావులు, సామాన్యులు చురకలు అంటించారు. `అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్నట్టు` బిఆర్ఎస్ కలలన్నీకల్లలుగా మారాయి. ఏదో చేస్తామని ధీమాతో ఉన్న గులాబీ దండుకు ఊహించని షాక్ తగిలింది. మూడు నెలల తరువాత తన రాజకీయ తంత్రంతో కేసీఆర్ ఏదో చేస్తారని ఆశపడిన బిఆర్ఎస్ వర్గాలకు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ గెలవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు.
ఇక్కడ గురువారం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గంటలు గడవక ముందే ఫాంహౌస్ బాత్రూమ్‌లో కేసీఆర్ జారిపడటం…బలమైన గాయం కావడం.. ఎడవకాలు తుంటి ఫ్రాక్చర్ కావడం, వెంటనే సర్జరీ చేయాల్సి రావడం లాంటి పరిణామాలు చక చకా జరిగిపోయాయి. సర్జరీ అనంతరం కేసీఆర్‌కు 6 వారాల నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు తేల్చి చెప్పడంతో మూడు నెలల తరువాత అధికారం పక్కా అని ధీమా వ్యక్తం చేసిన గులాబీ నేతల ఆశలన్నీ ఆవిరైపోయాయి. జనం కూడా ఈ వయసులో కేసీఆర్ విశ్రాంతి తీసుకోవడమే మంచిదని చెబుతుండటంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైంది.
కేసీఆర్ వయసు డైబ్బై పైనే కాబట్టి గాయం నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో మూడు నెలల్లో అధికారం మాదే అని కలలు గన్న బిఆర్ఎస్ నేతల కలలన్నీ కల్లలుగా మారినట్టే అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. `తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడన్నట్టు` గులాబీ నేతలు ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకుని మళ్లీ చక్రం తిప్పాలంటే మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది. దీంతో ముందు ఆయన కోలుకోవడం పైనే పార్టీ వర్గాలు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత జరిగేది జరుగుతుందని, అంత వరకు వేచి చూడాల్సిందేనని గులాబీ క్యాడర్ ఆలోచిస్తోందట.