JAISW News Telugu

BRs No Slogan : వాదం లేదు.. నినాదం లేదు.. ఎలా సారూ?

BRs No Slogan

BRs No Slogan

BRs No Slogan : ప్రస్తుతం కారు జోరుకు బ్రేక్ పడింది. కారు కష్టాల్లో పడింది. గత వైభవం ఎంతో మిన్న. ప్రస్తుత పరిస్థితి గుండు సున్న. గతంలో కారు టికెట్ కు గిరాకీ ఉండేది. టికెట్ రావాలంటే చాలా ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు టికెట్ ఇస్తామన్నా వద్దనే వారుంటున్నారు. టికెట్ ఇచ్చినా మాకు అక్కర్లేదని చేతులు దులుపుకుంటున్నారు. అదే లక్కంటే. అది ఉన్నప్పుడు కళ్లు నెత్తిమీదకొస్తే ఇలాంటి పరిస్థితే దాపురిస్తుంది. అదే నిండు కుండలా ఉంటే ఏ కష్టమూ రాదు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో కారు.. సారు.. పదహారు అనే నినాదంతో ముందుకు వెళ్లింది. ఇప్పుడు ఆ గళం, దళం కనిపించడం లేదు. బీఆర్ఎస్ కు బలమే కరువైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అంత సులభం కాదనే ఉద్దేశంతోనే కడియం శ్రీహరికి టికెట్ కట్టబెట్టినా తరువాత నాకు వద్దని కాంగ్రెస్ కండువా కప్పుకోవడం విశేషం.

బీఆర్ఎస్ కు నాటి రోజులు తీపి గుర్తులే. నేటి రోజులు వాటికి తగిలిన గాయాలే. కాంగ్రెస్ పార్టీ కీలెరిగి వాత పెట్టింది. దీంతో బీఆర్ఎస్ మొత్తుకుంటోంది. అచ్చంగా అప్పటి దుస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ కు పట్టడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ మీద పడి ఏడుస్తోంది. తమ పార్టీ నేతలను వారి పార్టీలో కలుపుకుంటున్నారని శోకం పెడుతోంది. మరి ఆనాడు మీరు చేసిందేమిటి చెప్మా అంటే సమాధానం లేదు.

ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ లకు ఓ విధానం, నినాదం ఉంది. కానీ బీఆర్ఎస్ కు ఏ వాదం లేదు. ప్రస్తుతం తెలంగాణ వాదం పడకేసింది. ఆ పార్టీకి ఓట్లు రాల్చే నినాదం మూగబోయింది. ఇప్పుడు ఎలా ఓట్లడుగుతారు. ఏమని చెబుతారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు భంగపాటు తప్పదు. పరాభవం మరింత ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమే. అందరు పార్టీని వీడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మిగిలిన నేతలు పార్టీ వీడకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ మీద కారాలు మిరియాలు నూరితే ఇంకా నష్టమే ఎక్కువ. ఇది గుర్తించుకుని మసలుకుంటే మంచిది. భవిష్యత్ మీద వారికి ఆశలు కల్పించడమే వారి ప్రధాన కర్తవ్యంలా ఉండాలి.

Exit mobile version