BRS MP Candidate : తెలంగాణలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఉనికి క్రమంగా కోల్పోయిందని, ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు క్యాండిడేట్స్ దొరకడం లేదని.. ప్రకటించిన వారు కూడా విడిచి వెళ్లిపోతున్నారని కాంగ్రెస్, బీజేపీ పదే పదే చెప్తున్నాయి. అయితే ఎన్నికల వేల ఇవన్నీ ఆరోపణలు అంటూ బీఆర్ఎస్ పార్టీ కేడర్ కొట్టి పారేస్తున్నా.. గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం అలాగే ఉంది.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొంత కాలం క్రితం ప్రకటించారు. ఇందులో భాగంగా ఖమ్మం నుంచి పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరును ప్రకటించారు. అయితే, ఆయన బీఆర్ఎస్ ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి.
నామా నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఖమ్మం సిట్టింగ్ ఎంపీ. కాబట్టి ఈ సారి కూడా ఇక్కడ పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఖమ్మం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ నామా పార్టీని వీడి బీజేపీలో చేరుతారని ఇటీవల టాక్ వినిపిస్తుంది.
ఒకటి రెండు రోజుల్లో నామా బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన బీజేపీ అధినాయకులతో చర్చలు ప్రారంభించారని, ఆయన పార్టీలో చేరడం లాంఛన ప్రాయమేనని సమాచారం.
కేసీఆర్ స్వయంగా ప్రకటించిన తర్వాత ఎంపీ అభ్యర్థిని కోల్పోవడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని, తన బలహీనతను ఎత్తిచూపుతుందని బీఆర్ఎస్ కు ఇది ఆందోళనకర పరిస్థితి అని, ఈ క్లిష్ట పరిస్థితిని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారని రాజకీయ విశ్లేషకులు సానుభూతి తెలుపుతున్నారు.