BRS – Congress : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బలం కాదు.. కాంగ్రెస్ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..
BRS – Congress : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. రీసెంటుగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని బలపడిపోతామనో.. లేక బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేస్తున్నాం అనుకుంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీకే నిప్పు పెట్టుకుంటున్నామన్న సంగతిని గుర్తించలేకపోతున్నారు. సరే ఈ సారి ఎన్నికల్లో గెలిచిన పాతిక మంది వరకూ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుంటారు.. మరి వారిపై పోరాడి ఓడిపోయిన వారి సంగతేంది ?. వారికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోరాడిన పార్టీ క్యాడర్ పరిస్థితి ఏం కావాలి. ఇప్పుడు వారిని పార్టీలో చేర్చుకుంటే వారు మాత్రమే రారు.. అధికార పార్టీ అనే ఫలాలు అనుభవించడానికి వారి అనుచరగణం కూడా తరలి వస్తారు. దీనితో ఎవరికి లాభం చేకూరుతుంది.
వాస్తవానికి ఓ పార్టీ తరపున గెలిచి మరో పార్టీ లో చేరడం.. వారిని అలా పార్టీలోకి ఆహ్వానించడం అనైతికం. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో నైతికత.. అనైతికతకు చోటు లేదు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే చేశారు. పైగా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని పదే పదే హెచ్చరికలు కూడా చేశారు. ఇక ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్నట్లుగా రాష్ట్రంలో రాజకీయం మొదలైంది. కేసీఆర్ కు అనుంగు అనుచరులుగా.. శిష్యులుగా ముద్రపడిన వారు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇది తమ గొప్పతనం అని కాంగ్రెస్ భావిస్తుంది. కానీ అది అధికారానికి ఉన్న గొప్పతనం. కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు ఒక్కరూ కాంగ్రెస్ లో చేరలేదు. పైగా కాంగ్రెస్ పై దూషణలు చేశారు. అంతేనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ను ఓడించడానికి ప్రయత్నించి.. ఆయా నియోజకవర్గాల్లో ఓడించిన వారు జై కాంగ్రెస్ అంటూ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి చేరికల వల్లనే బీఆర్ఎస్ ఎక్కువగా నష్టపోయింది. రేపు కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి వస్తుందనడంలో సందేహం లేదు.