BRS : మూసీ కబ్జాలపై బీఆర్ఎస్ మార్క్ రాజకీయం.. వ్యూహలోపమేనా..?

BRS

BRS Leader KCR and KTR

BRS Politics : ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతున్నది. రాజకీయంగా ఆయా పార్టీలు హైడ్రాపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు మూసీ సుందరీకరణకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నది. దీనిపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నది.  మూసీ సుందరీకరణ ప్రాజెక్టును పాకిస్థాన్ కు చెందిన కంపెనీకి ఇస్తున్నారంటూ ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నది. ఇప్పటికే మూసీలో ఆక్రమణలను తొలగించే పనిలో పడ్డారు. దీనిని కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అంటే ఆక్రమణలకు మద్దతుగా నిలుస్తున్నదన్నమాట. అయితే ఈ నిర్ణయం పార్టీలో వ్యూహలోపమేనని పలువురు చర్చించుకుంటున్నారు.
మూసీలో ఆక్రమణల్లో ఎక్కువమంది పేదలే ఉన్నారు. వారి విషయంలో కొంత ఆలోచించాల్సిందే. వారికి పునరావాసం కల్పించేందుకు పదిహేను వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూసీ ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకుంది. పెద్ద మురికి కాలువలా ఇప్పుడు మూసీ మారిపోయింది. ఇక ఇప్పుడు మూసీ సుందరీకరణకు రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని చాలా మంది హర్షిస్తున్నారు. అయితే మూసీ సుందరీకరణకు పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉంది.
అయితే రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ గుడ్డిగా వ్యతిరేకిస్తున్నది. గతంలో మూసీ సుందరీకరణ తామే చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంది. ఇప్పుడేమో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి నవ్వులపాలవుతున్నది. మూసీ సుందకరీకరణ ప్రాజెక్టును వ్యతిరేకించడానికి బలమైన కారణమెంటో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు చెప్పలేదు. వ్యూహలోపమే ఇందుకు కారణంగా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు మంచి చేసే నిర్ణయాన్ని హర్షించాల్సింది పోయి వ్యతిరేకించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణల నేపథ్యంలో అక్కడున్న వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. అవి పూర్తయ్యాకే మూసీ పనులు ప్రారంభిస్తామని చెబుతున్నది. ఇంకా ఈ విషయంలో బీఆర్ఎస్ కు తప్పు ఎక్కడ కనబడుతున్నదో అర్థం కావడం లేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేవలం విషరాజకీయాలు చేయడమే పనిగా బీఆర్ఎస్ పార్టీ నేతలు పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు.
TAGS