BRS:తెలంగాణలో అధికారం చేతులు మారింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఊహించని విధంగా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసింది. అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించనట్టుగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం మొదలైంది. ఒకరిపై ఒకరు తూటాల్లాంటి మాటలతో ఎదురు దాడి చేసుకుంటున్నారు.
గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసన సభ్యులు కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు గుప్పించుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు రణరంగంగా మారాయి. అప్పటి నుంచి కాంగ్రెస్‌పై కేటీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర ఆస్తుల వివరాలతో భారత్ రాష్ట్ర సమితి ఓ డాక్యుమెంట్‌ని విడుదల చేసింది. పదేళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తుల పేరిట తాజా డాక్యుమెంట్‌ని రూపొందించింది. కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను అందులో పొందుపరిచింది. కాగా ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయనున్న విషయం తెలిసిందే. దీనికి ముందే భారత్ రాష్ట్ర సమితి తాజా డాక్యుమెంట్‌ని విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తప్పికొట్టేలా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.