Coal Mines Auction : గనుల వేలంలో అడ్డంగా బుక్కయిన బీఆర్ఎస్!
Coal Mines Auction : తెలంగాణలో బొగ్గ గనుల వేలంలో బీఆర్ఎస్ బాగోతం బయటకు వచ్చింది. రాష్ట్ర ఖనిజ సంపద కాపాడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలకు ఏ మాత్రం పొంతన లేదనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ కూడ బలుక్కొని ఖనిజ సంపదను ప్రైవేట్ పరం చేస్తున్నాయని గగ్గోలు పెడుతోన్న బీఆర్ఎస్.. తమ అధికారంలోనే ఉన్న సమయంలో గనులను వేలం వేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తేలింది.
కేంద్రం నోటిఫై చేసిన 11 గనుల్లో ఆరింటికైనా జూన్ 30వ తేదీలోగా వేలం ప్రక్రియను పూర్తి చేయాలని జూన 16న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంత తక్కువ వ్యవధితోనే వేలానికి కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంపై రేవంత్ సర్కార్ అనుమానించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను ఆరా తీయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లాలోని సైదులనామా, పసుపులబోడు, సుల్తాన్ పూర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో లైమ్ స్టోన్ గనులను వేలం వేసేందుకు కేసీఆర్ సర్కార్ 2018, అక్టోబర్ 5న కేంద్రానికి లేఖ రాసి.. అనుమతివ్వాలని కోరింది. పర్యావరణ సంబంధిత అంశాలతో ముడిపడింది కావడంతో కేంద్రం అనుమతి కోరింది.
కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో 2019లో రిమైండర్ పంపింది బీఆర్ఎస్ సర్కార్. అయినా రిప్లయ్ రాకపోవడంతో 2020, సెప్టెంబర్ 16న మళ్లీ రిమైండర్ పంపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే గనుల వేలానికి అంగీకరించినందుకు ముందస్తు పర్మిషన్ అవసరం లేదని, వేలం ప్రక్రియ కొనసాగించవచ్చునని కేంద్రం 2021, డిసెంబర్ 12న 3 లైమ్ స్టోన్లను లీజ్ కు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వీటికి కొనసాగింపుగానే వేలం ప్రక్రియను వేగం చేయాలంటూ కేంద్రం ఇటీవల ఆదేశించింది.
‘తాము తెలంగాణ సంపదను కాపాడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్రంతో కుమ్మకై గనులను ప్రైవేట్ పరం చేస్తోందని’ కొద్ది రోజులుగా బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ సర్కార్ ఆరా తీయగా అసలు విషయాలు బయటకు రావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు నీళ్లు నములుతున్నారు.