Singareni:సింగరేణి ఎన్నికలపై కేసీఆర్ ఎందుకు వెనక్కి తగ్గినట్టు?
Singareni:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర ప్రభావం చూపినట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే ఆయన త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికలలకు పార్టీ వర్గాలు, అనుబంధ యూనియన్‌లు దూరంగా ఉండాలని ఆయన సూచించినట్టుగా తెలుస్తోంది. తాజాగా అనుకున్నట్టుగానే కేసీఆర్ సింగరేణి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అనుబంధ టీబీజీకెఎస్ నేతలకు సూచించారు.
దీంతో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ఎన్నికల్లో చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీ నిర్ఱయంపై టీబీజీకెఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మూకుమ్మడిగా వారంతా కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో అసంతృప్తి నేతలంతా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
కేసీఆర్ నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యమని టీబీజీకెఎస్ నేతలు అంటున్నారు. ఉద్యమం నుంచి పుట్టిన సంఘాన్ని పోటీచేయవద్దని చెప్పడం బాధాకరమని టీబీజీకెఎస్ నేత మిర్యాల రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వాలు, యాజమాన్యం అడ్డుకోవాలని ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలించలేదు. కేంద్ర లేబర్ కమీషన్ ఎన్నికల తేదీని ప్రకటించగా, నామినేషన్‌ల ప్రక్రియ, గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. దీంతో కార్మిక సంఘాలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
అయితే కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంధన కార్యదర్శి ఎన్నికలను నిలిపివేయాలని మధ్యంతర పిటీషన్ వేశారు. అయితే ఆ పిటీషన్‌ను కొట్టి వేస్తూ గురువారం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో కార్మిక సంఘాలు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో సింగరేణిలో ఎన్నికలు అనివార్యంగా మారాయి. అయితే ఈ ఎన్నికల్లో టీబీజీకెఎస్ నేతలు పోటీ పడొద్దని, పోటీ నుంచి తప్పుకోవాలని కేసీఆర్ సూచించడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఈ నిర్ణయం ఎంతుకు తీసుకున్నారు? ..ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు.