MP Chamala Kiran Kumar : ఆ దాడి వెనుక బీఆర్ఎస్ కార్యకర్తలు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

MP Chamala Kiran Kumar
MP Chamala Kiran Kumar Reddy : వికారాబాద్ దాడి ఘటనను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులపై దాడులు దురదృష్టకరమని అన్నారు. ఒక కలెక్టర్ పై దాడి చేయడం అంటేనే ప్రజాస్వామ్యం ఎటు పోతుందో అర్థం కావడం లేదని చెప్పారు. భువనగిరి కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలనే దానిపైనే దృష్టి పెట్టారని అన్నారు.
ఫార్మాసిటీ కోసం పబ్లిక్ హియరింగ్ చేస్తున్న అధికారికి సమస్యలు ఉంటే చెప్పుకోవాలి కానీ దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారులపై దాడులు చేయడానికి బీఆర్ఎస్ ప్రోద్బలం కారణమని ఆరోపించారు. గత పదేళ్లు దోచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేసిందని ఆరపించారు. ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని మూడు సార్లు గెలిపించిన కొడంగల్ లాంటి ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు అధికారులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారితో పాటు ప్రోత్సహించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.