Britain Royal Family:బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ క్రిస్మస్ మెనూ ఏంటో తెలుసా?
Britain Royal Family:క్రిస్మస్ రోజు రాజకుటుంబం ఏం చేస్తుంది? ఎలాంటి వంటకాలు రుచి చూస్తుంది అన్నది చాలా కాలంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.అయితే దీని గురించి మాజీ చెఫ్ డారెన్ మెక్ గ్రాడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా రాజకుటుంబం ఖరీదైన వంటకాలు ఆరగిస్తుందని అంతా అనుకుంటారు కానీ అందులో ఎలాంటి నిజం లేదన్నారు. బ్రిటన్‌లోని సామాన్యుల ఇళ్లలో ఎలాంటి వంటకాలైతే ఉంటాయో రాజకుంటుంబం కూడా అలాంటి వంటకాలనే స్వీకరిస్తుందన్నారు.
ఈ విషయంలో వారు చాలా సంప్రదాయంగా వ్యవహరిస్తారని వెల్లడించారు. 1980,90ల కాలంలో శాండ్రింగ్ హోమ్‌లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో రాజకుటుంబీకులకు డారెన్ మెక్ గ్రాడీ స్వయంగా వంట చేసి వడ్డించేవారు. ఇటీవల ఆయన `ఓకే` అనే మ్యాగజైన్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. క్రిస్మస్ ముందురోజు రాజకుటుంబం అంతా శాండ్రింగ్హోమ్కు చేరుకోవడంతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అవుతాయి. ఆ రోజు మధ్యాహ్నం తేనీరు, రుచికరమైన శాండ్విచ్లు, కేక్‌లతో విందు భోజనాలు ప్రారంభం అవుతాయి.
తర్వాత కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ పలకరింపులుంటాయి. రాత్రి భోజనంలో చేపల వంటకాలు, సలాడ్ శాండ్రింగ్హోమ్ ఎస్టేట్‌లో పెంచిన లేడి మాంసం వంటివి వడ్డించే వాళ్లం. డెజర్ట్ కింద `టార్టె టాటిన్`, తేదా రాణి ఎలిజబెత్ IIకు అత్యంత ఇష్టమైన `చాకొలెట్ పర్ఫెక్షన్ పై` ఉండేవి. డ్రింక్స్ విషయంలో రాయల్ ఫ్యామిలీ చాలా సంప్రదాయంగా ఉండేది. సాయంత్రం `జిన్`, `డుబోనెట్`తో డ్రింక్స్ ప్రారంభిస్తారు. రాయల్ సెల్లార్‌లోని సైనికుడొకరు రాత్రి భోజన సమయంలో షాంపైన్, ఫైన్ వైన్స్ సర్వ్ చేసేవారు.
భోజన సమయంలో కుటుంబీకులంతా కొన్ని నియమాలను కచ్చితంగా ఆచరించేవారు. రాణి వచ్చే వరకు ఎవరూ కూర్చునే వారు కాదు. అలాగే ఆమె తినడం ప్రారంభించేవరకు మిగతా ఎవరూ భోజనాన్ని స్వీకరించే వారు కాదు. వీటిలో చాలా నియమాలు ప్రస్తుత రాజు చార్లెస్ III హయాంలోనూ జరుగుతాయని ఆశిస్తున్నా. తరువాత రోజు నేను స్టాఫ్ డిస్కోకు డీజేగానూ వ్యవహరించేవాడిని. రాత్రి ఒంటిగంట వరకు అది కొనసాగేది. ఒక సారి ఈ డిస్కోకు అప్పటి ప్రిన్సెస్ డయానా కూడా వచ్చారు. క్రిస్మస్ రోజు ఉదయం అల్పాహారంతో భోజనాలు ప్రారంభం అయ్యేవి. రాజకుటుంబంలోని మహిళలంతా వాళ్ల పడక గదుల్లోనే తరువాతి కార్యక్రమాలకు సిద్ధమవుతూ అల్పాహారాన్ని స్వీకరించేవారు.
మధ్యాహ్నం సరిగ్గా 1:45కు భోజనానికి కూర్చునేవారు. స్థానికంగా నోర్ఫోక్ ప్రాంతంలో పెంచిన టర్కీ కోళ్లతో చేసిన వంటకం ఇందులో ప్రధాన ఆకర్షణ. రాణి ఎలిజబెత్ II వడ్డించే వంటకాల్లో అల్లం ఉపయోగించే వాళ్లం కాదు. ప్రజలతో మాట్లాడే టప్పుడు ఎలాంటి వాసన రావొద్దని ఆమె ఉల్లికి దూరంగా ఉండేవారు. ఉదయం ఆరు గంటల నుంచిమధ్యాహ్నం 2:30 గంటల వరకు వంట చేసేవాళ్లం. తర్వాత రాణి ప్రసంగానికి హాజరయ్యే వాళ్లం` అంటూ డారెన్ మెక్ గ్రాడీ రాజకుటుంబానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు.