CBI : ఓ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులే లంచాల వసూళ్లకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ లో నర్సింగ్ కాలేజీ స్కాం వ్యవహారంలో తనఖీలకు వెళ్లిన అధికారులు పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు సీబీఐ అధికారులతో పాటు 22 మంది బయటి వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు. వీరిలో పలువురిని అరెస్టు చేసినట్లు సమాచారం.
ఇటీవల మధ్యప్రదేశ్ లో నర్సింగ్ కాలేజీ కుంభకోణం వెలుగు చూడగా దానిపై అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొన్ని కాలేజీలను తనిఖీ చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ పలు బృందాలను ఏర్పాటు చేసింది. అయితే, తనిఖీల సమయంలో ఈ బృందాలు భారీ స్థాయిలో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
కాలేజీలకు అనుకూల నివేదికలు ఇచ్చేందుకు గాను రూ.2 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేసి సీబీఐ అధికారులు పంచుకున్నారు. దీనికి అదనంగా దర్యాప్తు బృందానికి కేటాయించిన ఒక్కో నర్సింగ్ అధికారికి రూ.50 వేల వరకు, పట్వారీలకు రూ.20 వేల వరకు తీసుకున్నారు. ఈ విషయం రావడంతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక సమాచారం సేకరించింది. ఈ సందర్భంగా దాడులు జరిపిన సీబీఐ కొందరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సీబీఐ డిప్యూటీ ఎస్పీతో పాటు మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లు, మరో 22 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు ఎనిమిది నర్సింగ్ కాలేజీల డైరెక్టర్లు, ఛైర్ పర్సన్లు, సిబ్బంది, మధ్యవర్తుల పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.