Breast milk record : అమెరికాలోని టెక్సాస్ నగరంలో నివాసముంటున్న ఓ మహిళ వినూత్న రికార్డు సాధించింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలిస్ ఓ గ్లెట్సీ అనే మహిళ ఏకంగా 2600 లీటర్ల కంటే ఎక్కువ తల్లిపాలను దానం చేసింది. ఎందరో చినానరుల ఆకలి తీర్చి అమ్మతనం చాటింది. ఇప్పుడు ఇదొక రికార్డులా మారింది. 36ఏండ్ల ఎలిస్ 2014లో 1569 లీటర్ల పాలను విరాళంగా అందించి ఈ రికార్డు సృష్టించింది. దీని తర్వాత కూడా ఆమె తన దాన గుణాన్ని చాటింది. మొత్తంగా 2645 లీటర్ల తల్లిపాలను దానం చేసింది.
అయితే భారత్ లో ఓ మహిళ ఇలా దానం చేయాలంటే ఉన్న నిబంధనలు ఏంటో తెలుసా?
భారత్ లో తల్లిపాలను దానం చేయాలంటే చట్టపరమైన ప్రక్రియ ఉంటుంది. భారత్ లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ముందుగా దాత ఆరోగ్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆమె హెచ్ఐవీ, హెపటైటిస్, ఇతర అంటువ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. పాలలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ లు లేవని నిర్ధారించే క్రమంలో ఈ పరీక్షలు చేయాల్సి ఉంటుంది.
తల్లిపాలను దానం చేయడానికి 21నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఈ వయస్సు వారికే శారీరక ఆరోగ్యం, పాల ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. మొత్తం స్ర్తీ ఆరోగ్యంగా ఉంటేనే పాలు దానం చేయాలి. పాలు సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి ఇన్ ఫెక్షన్ సోకలేదని నిర్ధారించిన తర్వాతే పిల్లలకు పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా దరఖాస్తు చేసుకునేందుకు పాల బ్యాంకుకు వెళ్లి ఆమె ఆరోగ్యం, తీసుకునే ఆహారం తదితర వివరాల సమాచారాన్ని దరఖాస్తు ఫారంలో పూరించాల్సి ఉంటుంది. అనంతరం మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. తీసుకున్న పాలను పరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తారు. తద్వారా ఎలాంటి ధూళి, బ్యాక్టీరియా పాలలోకి ప్రవేశించదు. ఈ పాలను చిన్నారులకు పాల బ్యాంకు నిర్వాహకులు అందజేస్తారు.