Brahmotsavam : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చారు. శ్రీవారు ఎర్రటి పూలమాలలు ధరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు. సూర్యప్రభ వాహనంలో ఉండే నారాయణుడిని దర్శించే భక్తులకు భోగభాగ్యాలు, సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.
ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం మలయప్పస్వామి వారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులకు అభయమివ్వనున్నారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది.