Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు: మాజీ ఐటీ ఉద్యోగి అరెస్ట్
Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కొన్ని గంటల పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయంలో ఆర్డీఎక్స్ దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ వచ్చిన అజ్ఞాత మెయిల్స్ అధికారులను అప్రమత్తం చేసింది.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కేసులో మాజీ ఐటీ ఉద్యోగి వైభవ్ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘దయచేసి అంతర్జాతీయ విమానాశ్రయ తలుపులు తెరవొద్దు, హైజాకర్ మిమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడు’ అనే పదాలతో కూడిన ఈ మెయిల్ పంపాడు. ఈ మెయిల్ తో ఒక్కసారిగా పోలీసులు, అధికారులు, ఎయిర్ పోర్ట్ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
వైభవ్ 2012 నుంచి 2020 వరకు ఐటీలో పనిచేశాడు. కొవిడ్-19 కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత డీప్రెషన్ లోకి వెళ్లి ఎయిర్ పోర్ట్. ఇతర ముఖ్యమైన సంస్థలకు బెదిరింపు ఈమెయిల్స్ పంపడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు చాలా సంస్థలు, జనావాసాలు కలిగని ప్రదేశాను బ్లాస్ట్ చేస్తామని మెయిల్స్ పంపినట్లు తేలింది.
గురువారం ఉదయం మొదటి ఈ మెయిల్ రావడంతో ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ పోలీసులు, తెలంగాణ సివిల్ పోలీసులతో పాటు పలు విభాగాలు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంత హడావిడి తర్వాత ఈ మెయిల్ ఫేక్ అని నిర్ధారించారు. నకిలీ బాంబు బెదిరింపులతో వైభవ్ 200కు పైగా ఈమెయిల్స్ పంపినట్లు సమాచారం.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బెదిరింపులకు పాల్పడిన వైభవ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంకా కేసు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.