Bobby deol:రణ్‌బీర్ కపూర్ నటించిన `యానిమల్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కపూర్ బోయ్ పాన్ ఇండియా కలల్ని తెలుగు దర్శకుడు సందీప్ వంగా నిజం చేయడంలో సక్సెసయ్యారు. ఉక్కు వ్యాపారి అయిన శిక్కు కుటుంబంలో వైరం నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే సన్నివేశాలతో సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కించారు. హింస, విషపూరితమైన పురుషత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగినా కానీ, ఈ సినిమా వసూళ్లను ఏదీ ఆపలేకపోయింది. త్వరలోనే 1000 కోట్ల క్లబ్ లో చేరేనుంది యానిమల్.
అయితే ఈ సినిమాలో విలన్ పాత్రధారి బాబి డియోల్ పై సన్నివేశాల విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైన సంగతి తెలిసిందే. అతడు మూడో పెళ్లి చేసుకుని మాంచి మూడ్ లో ఉన్నప్పుడు తన సోదరుడు చనిపోయిన వార్తను మోసుకొచ్చిన వాడిని క్రూరంగా హత్య చేసి, అదే చోట నవవధువుపై అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత తన ఇతర ఇద్దరు భార్యలపైనా బలాత్కారం చేసే సన్నివేశాల్ని తెరపై చూపించారు. ఇది వైవాహిక అత్యాచారం (మ్యారిటల్ రేప్). పెళ్లయినా భార్య అంగీకారం లేకుండా అత్యాచారం చేయడం క్రూరత్వం అంటూ తీవ్ర విమర్శలు చెలరేగాయి.
అయితే చాలా తక్కువ నిడివితో ఉన్న విలన్ పాత్రను బలంగా చూపించడానికి ఆ సన్నివేశాలు అవసరమయ్యాయని బాబి డియోల్ తాజా ఇంటర్వ్యూలో అన్నారు. అత్యాచార సన్నివేశం లేకపోతే ఇంత పెద్ద హిట్టయ్యేది కాదని కూడా అతడు వ్యాఖ్యానించారు. అలాగే ఇలాంటి వాటిని చూసి సమాజం ప్రభావితం అవుతుందనేది తాను నమ్మనని అన్నాడు. తాను సినిమాలు చూసి ప్రభావితం కానని స్పష్ఠం చేసాడు. నిజజీవితంలో ఇలాంటి నేరాలు ఘోరాలకు పాల్పడే వారిని తాను చూసానని కూడా బాబి అన్నారు. బాహ్య ప్రపంచంలో జరుగుతున్న దానినే వెండితెరపై సందీప్ వంగా చూపించారని కూడా బాబి డియోల్ వ్యాఖ్యానించారు. మీడియా సమీక్షలను వృధా శక్తిగా భావిస్తానని వాటి కోసం సమయం వృధా చేయనని కూడా అన్నారు.